Begin typing your search above and press return to search.

భారత పౌరసత్వాన్ని 17.50 లక్షల మంది వదులుకున్నారు!

దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌ సభలో వెల్లడించారు

By:  Tupaki Desk   |   22 July 2023 8:03 AM GMT
భారత పౌరసత్వాన్ని 17.50 లక్షల  మంది  వదులుకున్నారు!
X

గడిచిన పది పన్నెండేళ్లలో లక్షల మంది భారతీయులు.. ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఒక్క 2020 మినహా మిగిలిన అన్ని ఏడాదుల్లోనూ లక్షకు తగ్గకుండా వీరి సంఖ్య ఉంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి లోక్ సభలో వెల్లడించారు.

అవును... భారత పౌరసత్వాన్ని ఎంతమంది వదులుకున్నారు.. వీరి సంఖ్య గడిచిన దశాబ్ధ కాలంగా ఎంత ఉంది.. ఇదే సమయంలో ఏటా ఎంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు అనే విషయాలను విదేశాంగ మంత్రి లోక్ సభలో వెల్లడించారు.

ఈ మేరకు ఒక ప్రశ్నకు సమాధానంగా స్పందించిన మంత్రి... 2011 నుంచి ఇప్పటివరకు 17.50లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ఇందులో ఈ ఏడాది జూన్ వరకు 87,026 మంది దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌ సభలో వెల్లడించారు.

వీరిలో 2022లో అత్యధికంగా 2,25,620 మంది.. అత్యల్పంగా 2020లో 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2011 నుంచి 2023 జూన్ నెల వరకు ఏడాది వారీగా పౌరసత్వాన్ని వీడిన భారతీయుల గణాంకాలను ఆయన తెలియజేశారు.

కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారిలో చాలా మంది అగ్రరాజ్యం అమెరికా వైపు మొగ్గుచూపారు. వీరిలో 2021లో ఏకంగా 7,88,284 మంది అమెరికా బాట పట్టారు. 23,533 మందితో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది.

అనంతరం వరుసగా... కెనడా (21,597), యూకే (14,637), ఇటలీ (5,986), న్యూజిలాండ్ (2,643), సింగపూర్ (2,516), జర్మనీ (2,381), నెదర్లాండ్స్ (2,187), స్వీడన్ (1,841), స్పెయిన్ (1,595) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2011లో 1,22,819 మంది.. 2012లో 1,20,923 మంది.. 2013లో 1,31,405 మంది.. 2014లో 1,29,328 మంది.. 2015లో 1,31,489 మంది.. 2016లో 1,41,603 మంది.. 2017లో 1,33,049 మంది.. 2018లో 1,34,561 మంది.. 2019లో 1,44,017 మంది.. 2020లో 85,256 మంది.. 2021లో 1,63,370 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు మంత్రి తెలిపారు.