Begin typing your search above and press return to search.

ఫారిన్ టూర్ కు ప్లానింగా? అక్టోబరు 1 నుంచి కొత్త పన్ను వడ్డింపు

ఇదిలా ఉంటే.. తాజాగా ఫారిన్ టూర్లకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్ ఒకటి అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి రానుంది.

By:  Tupaki Desk   |   15 Aug 2023 4:31 AM GMT
ఫారిన్ టూర్ కు ప్లానింగా? అక్టోబరు 1 నుంచి కొత్త పన్ను వడ్డింపు
X

కొవిడ్ పుణ్యామా అని నెలల తరబడి ఇళ్లకే పరిమితమైపోయిన దుస్థితి. దీంతో.. పరిస్థితుల్లో మార్పు వచ్చిన నేపథ్యంలో ఎక్కడికైనా వెళదామన్న ఆలోచన అందరిలోనూ పెరిగింది. ఇందులో భాగంగా దేశీయంగా కంటే విదేశీ పర్యటనల వైపు మొగ్గు చూపే ధోరణి అంతకంతకూ ఎక్కువైంది. దీని పుణ్యమా అని.. ఫారిన్ టూర్లు ఈ మధ్యన జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఫారిన్ టూర్లకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్ ఒకటి అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం విదేశీ పర్యటనలు చేసే వారి జేబుకు మరింత చిల్లు పడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పెరిగిన విమాన ఛార్జీల భారం సరిపోక.. కొత్తగా తీసుకొచ్చిన పన్ను వాయింపు షాకిచ్చేలా ఉంది.

విదేశీ ప్రయాణాలకు గతంలో మాదిరి సంపన్నులే కాక.. ఇటీవల కాలంలో మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వారు సైతం ప్లాన్ చేస్తున్నారు. కొవిడ్ తర్వాత ఇలాంటి పరిస్థితులు మరింతగా పెరిగాయి. దీన్ని అసరాగా చేసుకున్న కేంద్రం కొత్త ఆదాయ మార్గాలకు తెర తీసింది. విదేశీటూర్లకు వెళ్లే వారు ఎవరైనా తమకు తాముగా సొంతంగా ప్లాన్ చేసుకోకుండా.. ఫారిన్ టూర్ ఆపరేటర్ల సాయంతో ప్యాకేజీ రూపంలో ట్రిప్ కు వెళితే మాత్రం.. జేబుకు చిల్లు పడే కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

దీని ప్రకారం.. అక్టోబరు ఒకటి నుంచి టూర్ ఆపరేటర్ల ద్వారా విదేశీ ప్రయాణాలు చేసే వారు ఇరవై శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఈ పన్ను మొత్తాన్ని చివర్లో ఆదాయ పన్ను మినహాయింపు పొందే వీలున్నా.. ఖర్చు చేసిన తర్వాత ఏడాది వరకు ఈ మొత్తం కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఇప్పటివరకు టూర్ ప్యాకేజీ మొత్తంలో 5 శాతం టీసీఎస్ గా వసూలు చేసే వారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 20 శాతంగా మారనుంది. అంటే.. టూర్ కోసం ఒక ఫ్యామిలీ రూ.5లక్షలు ఖర్చు చేస్తే.. అందుకు రూ.లక్ష మొత్తాన్ని టీసీఎస్ రూపంలో ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే.. ఈ వడ్డింపునకు వైద్యం.. విద్య అవసరాల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. ఒకవేళ టూర్ ఆపరేటర్లు కాకుండా సొంతంగా తమ ఫారిన్ టూర్ ను ప్లాన్ చేసుకున్న వారి మీద మాత్రం ఎలాంటి భారం ఉండబోదు. అయితే.. ఎంతమంది తమకు తాముగా.. ఆపరేటర్ల సాయం లేకుండా సొంతంగా విదేశీ ప్రయాణాలు చేస్తారన్నది ప్రశ్న. అదే సమయంలో సొంతంగా కాకుండా టూరిస్టు వీసా.. విమాన టికెట్లు ఆపరేటర్ల ద్వారా తీసుకొని.. విదేశాల్లో హోటల్ గదులు.. వాహన బుకింగ్ లు సొంతంగా చేసుకున్న వారికి కూడా టీసీఎస్ భారం తగ్గనుంది. సో.. టూర్ ఆపరేటర్ల సాయంతో ప్యాకేజ్ టూర్లకు వెళ్లే వారికి మాత్రం భారీ భారం పడనుంది. సో.. ఫారిన్ టూర్ కోసం ప్లాన్ చేస్తుంటూ కాస్తంత ఆలోచించి మాత్రమే టూర్ బుక్ చేయాల్సిన అవసరం ఉంది.