Begin typing your search above and press return to search.

అత్యంత సంతోషకరమైన దేశం ఇదే... షాకింగ్ గా భారత్ - పాకిస్థాన్?

ప్రపంచ సంతోషదాయక దేశాల జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది

By:  Tupaki Desk   |   24 July 2023 11:30 PM GMT
అత్యంత సంతోషకరమైన దేశం ఇదే... షాకింగ్  గా భారత్ - పాకిస్థాన్?
X

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది.. ఆ విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్నదేశం ఏది.. అత్యంత దిగువున ఉన్న దేశం ఏది.. ఇదే సమయంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ స్థానం ఎంత.. తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్ ఏమిటి.. ప్రస్తుతం యుద్దంలో ఉన్న రష్యా, యుక్రెయిన్ ల పరిస్థితి ఏమిటి అనే వివరాలు విడుదలయ్యాయి.

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చింది. ఈ జాబితాలో మరోసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. గత 6 సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో వరుసగా అగ్రస్థానంలో కొనసాగుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవలప్మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌ వర్క్ 150కి పైగా దేశాల్లో ప్రజ‌ల‌ను స‌ర్వే చేసి ఈ రిపోర్ట్ రూపొందించింది.

అయితే ఈ సంతోషకరమైన దేశాల్లో టాప్ 20 లో ఒక్క ఆసియా దేశం కూడా లేకపోవడం విచారించాల్సిన విషయం! అవును... మొదటి 20 సంతోషకరమైన దేశాల జాబితాలో ఒక్క ఆసియా దేశం కూడా స్థానం సంపాదించుకోలేదు. మొదటి 20 సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్‌ తో పాటు డెన్మార్క్, ఐస్‌ లాండ్, స్వీడన్, నార్వే వంటి దేశాలు ఉన్నాయి.

ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితాను రూపొందించేటప్పుడు.. ఆ దేశాల ప్రజల జీవనశైలి, జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వంతో పాటు అవినీతిని తదితరాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రాతిపదికన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఈసారి కూడా ఫిన్లాండ్‌ ను తన ర్యాంకింగ్‌ లో అగ్రస్థానంలో ఉంచింది.

ఏదేశంలో ప్రజలు తమ జీవితాలను మెరుగుపర్చుకోవడానికి ఎంత ఎక్కువ ప్రయత్నాలు చేస్తారో.. దానికి అనుగుణంగా అక్కడి ప్రభుత్వం కూడా తన ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుందో.. ఆ దేశంలోని ప్రజలు ఎక్కువ సంతోషంగా ఉంటారని ఈ నివేధిక తెలుపుతుంది. ఈ విషయంలో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఈ జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలువగా.. డెన్మార్క్, ఐస్ లాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, న్యూజిలాండ్ దేశాలు సంతోషకరమైన దేశాల జాబితాలో టాప్ 10 లో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ ఆసియా దేశం కాకపోవడం గమానార్హం.

అనంతరం... ఆస్ట్రియా, ఆస్ట్రేలియా,కెనడా,ఐర్లాండ్,యునైటెడ్ స్టేట్స్,జర్మనీ బెల్జియం, చెక్ రిపబ్లిక్,యునైటెడ్ కింగ్‌ డమ్, లిథువేనియా దేశాలు వరుసగా 11 నుంచి 20 స్థానాల్లో ఉన్నాయి. వీటిలో అగ్రరాజ్యం అమెరికాది 15వ స్థానం కాగా... యూకే ది 19వ స్థానం.

ప్రపంచ సంతోషదాయక దేశాల జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ కంటే పొరుగుదేశాలు పాకిస్థాన్, నేపాల్, చైనా, శ్రీలంక దేశాలు ముందున్నాయి. అలాగే ప్రస్తుతం యుద్ద దేశాలు అయిన ర‌ష్యా 72, ఉక్రెయిన్ 92వ స్థానాల్లో ఉండగా... అన్నింటికంటే దిగువన 137వ స్థానంలో అఫ్ఘానిస్థాన్ నిలిచింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... సంతోషంగా ఉన్న దేశాలు అని అంటే... అక్కడి ప్రజలు సంతోషంగా ఉండటం అంటే.. ఎక్కువ సంపదను కలిగి ఉండటమో.. సర్వసౌఖ్యాలు ఉండటమో కాదు. సంతోషంగా ఉండటం అంటే మానసిక ప్రశాతంత కలిగి ఉండటం.