Begin typing your search above and press return to search.

జర్మనీలో ఎలక్ట్రిక్ హైవేలు... ఇది నెక్స్ట్ లెవెల్!

ఇప్పటికే చాలా దేశాలు పూర్తిగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఆసక్తి చూపిస్తూ ప్రోత్సహిస్తున్నాయి.. వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:10 PM GMT
జర్మనీలో ఎలక్ట్రిక్  హైవేలు... ఇది నెక్స్ట్  లెవెల్!
X

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇకపై భవిష్యత్ రవాణా ఎలక్ట్రిక్ వాహనాలదే అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు పూర్తిగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఆసక్తి చూపిస్తూ ప్రోత్సహిస్తున్నాయి.. వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ సమయంలో జర్మనీలో ఈ కార్లకోసం ఎలక్ట్రిక్ హైవేలు తెరపైకి వచ్చాయి. దీంతో ఇది నెక్స్ట్ లెవెల్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... పెట్రోల్, డీజిల్ కార్ల దశ ముగియబోతుందని, ఇకపై భవిష్యత్ రవాణా అంతా ఎలక్ట్రిక్ కార్లదే అని తెలుస్తున్న నేపథ్యలో... దాంతో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో కరెంట్‌ తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఈ భారీ వాహనాలు ఎక్కువగా హైవేలపై కనిపిస్తుంటాయి. వీటికి పెద్దమొత్తంలో కరెంట్ అవసరం అనేది తెలిసిన విషయమే.

ఈ సమయంలో వీటి వినియోగం పెంచడానికి.. ఛార్జింగ్ సమస్యతో వీటిపై అనాసక్తి పెరగకుండా ఉండటానికి.. తరచూ సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం జర్మన్ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ హైవేలను ఏర్పాటు చేసింది! ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీ మొదటిసారి ఉపయోగించింది. ఇందులో భాగంగా హైవేపై వెళ్లే ట్రక్కుల పైభాగంలో ఎలక్ట్రిక్ ట్రైన్స్ మాదిరి కరెంట్‌ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది.

దీంతో ఆ విద్యుత్ వైర్ల నుంచి ట్రక్కులోని బ్యాటరీల్లోకి కరెంట్ సరఫరా అవుతుంది. ఈ సమయంలో ఒకపక్క రీచార్జ్ అవుతూనే మరో వైపు ట్రక్కు ముందుకుసాగుతూ ఉంటుంది. ఇలా సాగుతున్న సమయంలో... హైవే నుంచి డైవర్షన్‌ తీసుకున్న తర్వాత అప్పటికే బ్యాటరీలు ఛార్జ్‌ అవుతాయి కాబట్టి అందులోని విద్యుత్‌ ను వినియోగించుకుని వాహనం ప్రయాణం కొనసాగిస్తుంది.

కాగా ఈ తరహా భారత్ లోనూ సోలార్‌ ఎనర్జీ సాయంతో రోడ్లపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిందని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత ఛార్జింగ్‌ మెకానిజంను ఉపయోగించుకోవాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని మంత్రి అన్నారు.

ఇందులో భాగంగా.. ముందుగా ఢిలీ - జైపూర్ మధ్య భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవేను అభివృద్ధి చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇప్పటికే జర్మనీ, స్వీడన్‌, నార్వే వంటి దేశాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జర్మన్ లో ఇలా ఎలక్ట్రిక్ హైవే పై దూసుకుపోతున్న ఒక భారీ వాహనానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.