చైనాలో 10 రోజుల వీసా రహిత ప్రయాణం... వివరాలివే!
దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం కూడా కీలక భూమిక పోషిస్తుంటుంది. అసలు కొన్ని దేశాలకు పర్యాటక రంగమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటుంది.
By: Tupaki Desk | 12 Jun 2025 3:16 PM ISTదేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం కూడా కీలక భూమిక పోషిస్తుంటుంది. అసలు కొన్ని దేశాలకు పర్యాటక రంగమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటుంది. ఈ క్రమంలో తమ దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు చైనా ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... 240 గంటల పాటు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించే అవకాశం కల్పించింది.
అవును... తమ దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చే ప్రణాళికలో భాగంగా.. 55 దేశాలకు చెందిన ప్రజలు 10 రోజులు (240 గంటలు) వీసా లేకుండా తమ దేశంలో ప్రయాణిమే అవకాశం కల్పించింది చైనా. ఈ సందర్భంగా ప్రకటించిన దేశాల జాబితాలో ఇండోనేషియా, యూకే, రష్యా వంటివి ఉన్నాయి. ఈ మేరకు నేషనల్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఏ) ప్రకటించింది.
ఈ పథకం ప్రకారం చైనాలో ఆయా దేశాల ప్రజలు స్వల్పకాలిక పర్యటనలను సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. ఈ పాలసీతో చైనాకు వచ్చేవారి వద్ద ధృవీకరించిన తేదీలతో ఇతర దేశాలకు వెళ్లే ఇంటర్ లైన్ టిక్కెట్లు, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వీరు దేశంలో 24 ప్రావిస్నుల్లోని 60 ఓపెన్ పోర్టుల ద్వారా చైనాలో ప్రవేశించవచ్చు.
వీరు 10 రోజుల పాటు అనేక పర్యాటక స్థలాలను సందర్శించవచ్చు.. ఫ్యామిలీ విజిట్స్ వంటివి చేయవచ్చు. అయితే... పని, విద్య, అధ్యయనం లేదా వార్తల నివేదిక వంటివి మాత్రం చేయరాదు. ఒకవేళ ఇవి చేయాలంటే సరైన వీసాతో ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
