Begin typing your search above and press return to search.

పద్మ విభూషణుడు మన చిరంజీవి

By:  Tupaki Desk   |   25 Jan 2024 6:27 PM GMT
పద్మ విభూషణుడు మన చిరంజీవి
X

గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రకటించే పద్మ పురస్కారాలలో ఈసారి తెలుగు వారికి ఎంతో ఆనందం కలిగించే విషయాలు చోటు చేసుకున్నాయి. వెండి తెర వేలుపు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు కేంద్రం ప్రకటించింది. ఇది అత్యున్నతమైన రెండవ పౌర పురస్కారం. ఆయన కళా రంగానికి చేసిన విశేష సేవలకు గానూ ఈ అవార్డుని అందించారు.

ఇక రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉంటూ ఉప రాష్ట్రపతి దాకా ఎదిగిన అపూర్వ ప్రతిభాశాలి ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఆయన సామాన్యుడు కూడా అందలాలు ఎక్కగలరని నిరూపించినవారు. తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రుడైన నేతగా ఉన్న వెంకయ్యనాయుడుకు పద్మ విభూషణ్ అవార్డు దక్కడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటుగా పద్మ విభూషణ్ అవార్డు వరించిన వారిలో సామాజిక సేవ రంగం నుంచి బిందేశ్వర్ పాఠక్ (బీహార్), కళా రంగం నుంచి వైజయంతిమాల బాలి (తమిళనాడు), పద్మా సుబ్రహ్మణ్యం (తమిళనాడు) ఉన్నారు. మొత్తం అయిదుగురుకు పద్మ విభూషణ్ అత్యున్నత పురస్కారం లభించింది.

మెగాస్టార్ గా వెండి తెర మీద తన విశ్వరూపం చూపించిన చిరంజీవి 11978లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన తొలి సినిమా పునాది రాళ్ళు. అయితే రిలీజ్ అయింది మొదటిగా ప్రాణం ఖరీదు. ఆ తరువాత ఆయనకు తొలి బ్రేక్ వచ్చి స్టార్ డం తెచ్చింది 1983లో వచ్చిన ఖైదీ. ఆనాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మెగాస్టార్ గా ఆయన మూడు దశాబ్దాల క్రితమే సూపర్ స్టార్ డం సాధించారు. విశేషం ఏంటి అంటే ఆయన ఈ రోజు దాకా ఆ స్టార్ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తూ తనకు తిరుగులేదన్నట్లుగా కొనసాగుతున్నారు. 155 సినిమాలకు పైగా నటించిన మెగాస్టార్ నవరస నటనా ప్రావీణ్యం కలిగిన వారు.

ఇక ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అటు నటుడుగా ఇటు ప్రజా సేవకుడిగా మరో వైపు రాజకీయాలలో కొన్నాళ్ళ పాటు రాణించి కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవిది నిండైన వ్యక్తిత్వం. ఆయనకు శత్రువులు లేవు. అజాత శత్రువుగా ఆయన ఉన్నారు. అందుకే ఆయనకు అవార్డులు కోరి వరిస్తున్నాయి. మెగాస్టార్ ని పద్మవిభూషణ్ అవార్డు దక్కడం పట్ల తెలుగు జాతి అంతా గర్విస్తోంది.

అదే విధంగా చూస్తే ఎం వెంకయ్యనాయుడు కూడా రాజకీయాల్లో ఆదర్శ నేతగా నిలిచారు. ఎందరికో స్పూర్తిగా ఉన్నారు. ఆయన రాజకీయంగా చూడని ఎత్తులు లేవు, ఆయనకు ఈ అవార్డు దక్కడం అంటే తెలుగు వారు తమకు ఆ గౌరవం దక్కినట్లే అని భావిస్తున్నారు. ఈ ఇద్దరికీ అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.