Begin typing your search above and press return to search.

గజ్వేల్‌ను వీడ‌నున్న కేసీఆర్‌.. ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారో?

అయితే కేసీఆర్ పోటీ చేసే స్థానం నుంచి అప్ప‌టికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాయ‌కుడు మాత్రం సీట్ త్యాగం చేయ‌క త‌ప్ప‌దు

By:  Tupaki Desk   |   27 July 2023 8:10 AM GMT
గజ్వేల్‌ను వీడ‌నున్న కేసీఆర్‌.. ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారో?
X

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొత్త నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయాల‌ని చూస్తున్నారా? వ‌రుస‌గా రెండు సార్లు గెలిపించిన గ‌జ్వేల్‌ను వ‌దిలేస్తున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితాను ఆగ‌స్టు మూడో వారంలో వెల్ల‌డించేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు.

మ‌రోవైపు ఇత‌ర పార్టీల్లోని కీల‌క నేత‌ల‌నూ బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కూ తెర‌తీశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మాత్రం గ‌జ్వేల్‌లో పోటీ చేయ‌డం లేద‌నే ప్ర‌చారం సాగుతోంది.

2014, 2018 ఎన్నిక‌ల్లో కేసీఆర్ గ‌జ్వేల్ నుంచే పోటీ చేసి గెలిచారు. కానీ ఈ సారి మాత్రం నియోజ‌క‌వ‌ర్గం మార్చాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందుకు అనుగుణంగా ఆయ‌న మ‌రో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి సారించాని తెలిసింది.

ఇందులో నుంచి ఒక నియోజ‌క‌వ‌ర్గాన్ని పోటీ కోసం ఎంచుకుంటార‌నే ప్ర‌చారం సాగుతోంది. ముందుగా మంత్రి మ‌ల్లారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై కేసీఆర్ క‌న్నేశార‌ని అంటున్నారు. ఇది కాక‌పోతే పెద్ద‌ప‌ల్లి, కామారెడ్డిలో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగే ఆస్కార‌ముంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంకు బ‌లంగా ఉంది. దీంతో కేసీఆర్ ఎక్క‌డి నుంచి పోటీ చేసినా గెల‌వ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే కేసీఆర్ పోటీ చేసే స్థానం నుంచి అప్ప‌టికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాయ‌కుడు మాత్రం సీట్ త్యాగం చేయ‌క త‌ప్ప‌దు.

కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందుకు సిద్ధంగా లేన‌ట్లు స‌మాచారం. కానీ పార్టీ అధినేత అడిగితే మాత్రం ఇష్టం లేక‌పోయినా వ‌దులుకోవాల్సిందే. మ‌రోవైపు ద‌క్షిణ తెలంగాణ లేదా ఖ‌మ్మం నుంచి కేసీఆర్ పోటీ చేయాల‌ని కొంత‌మంది నాయ‌కులు స‌ల‌హాలిస్తున్నారు. అలా అయితే ఆ ప్రాంతంలో పార్టీ ప‌ట్టు పెర‌గ‌డంతో పాటు ప్ర‌త్య‌ర్థుల‌కు షాకిచ్చిన‌ట్లు ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి కేసీఆర్ మ‌నుసులో ఏముందో?