Begin typing your search above and press return to search.

టి.కాంగ్రెస్ కు కొత్త వ్యూహకర్త... కారణం ఇదే?

తాజాగా ఆయన స్థానంలో పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ గా మాజీ ఐఎఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్‌ ను అపాయింట్ చేసుకోనుందని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   19 July 2023 3:56 AM GMT
టి.కాంగ్రెస్  కు కొత్త వ్యూహకర్త... కారణం ఇదే?
X

ఒకప్పుడు ఎన్నికలంటే నాయకులు, ఓటర్లు మాత్రమే ఉండేవారు.. ఇప్పుడు వారిద్దరి మధ్యలోకి వ్యూహకర్త అనే కొత్త పాత్ర వచ్చిచేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని పార్టీలకూ వారి వారి స్థాయిల్లో వ్యూహకర్తలు ఉన్నారని అంటుంటారు. ఇందులో భాగంగా... తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త వ్యూహకర్త రాబోతున్నారని తెలుస్తుంది.

తెలంగాణలో మరో మూడూ నాలుగు నెలల్లో ఎన్నికలు అనే కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఎక్కువ సమయం ఏమీ లేనట్లే. ఈ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆరెస్స్ ఉర్రూతలూగుతున్నట్లు తెలుస్తుంటే.. మరోపక్క కర్నాటక ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందని అంటున్నారు.

ఇందులో భాగంగా... కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలపై కసరత్తు సాగిస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా... రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుందని అంటున్నారు.

అయితే కర్నాటక ఎన్నికల్లో సునీల్ కనుగోలు వ్యూహాలు బాగా పనిచేసాయని చెబుతుంటారు. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారతీరును ఆయన పర్యవేక్షించారని చెబుతుంటారు. అయినప్పటికీ తెలంగాణలో మత్రం మార్చాలని భావిస్తున్నారని సమాచారం.

ఇప్పుడు తాజాగా ఆయన స్థానంలో పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ గా మాజీ ఐఎఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్‌ ను అపాయింట్ చేసుకోనుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్‌ గా బాధ్యతలను స్వీకరించనున్నారని అంటున్నారు.

అయితే శశికాంత్ కూడా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వ్యూహకర్తగా పని చేశారని తెలుస్తుంది. సునీల్ కానుగోలు టీమ్‌ లో ఈయన ఒక కీలక సభ్యుడుగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పని చేయడానికి 40 మంది సభ్యులతో కూడిన ఓ టీమ్‌ ను సెంథిల్ కుమార్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇంత హడావిడిగా ఇంత కీలక సమయంలో సునీల్ ని తప్పించడానికి ఒక బలమైన కారణం ఉందని తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సునీల్ పాత్ర కీలకం అని అక్కడి కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారంట. దీంతో... సునీల్ ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు.

దీంతో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో.. సునీల్ కానుగోలు పూర్తిస్థాయిలో తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోతున్నారని చెబుతున్నారట. అందుకే... వార్ రూమ్ హెడ్, రాజకీయ వ్యూహకర్తగా శశికాంత్ సెంథిల్ కుమార్‌ ను నియమించుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ ఈసారి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాత్రం బలంగా నిర్ణయించుకున్నది అని అంటున్నారు పరిశీలకులు.