Begin typing your search above and press return to search.

మంత్రి సబితమ్మకు ఏమైంది? స్కూళ్లకు సెలవు పై షాకులు

సోషల్ మీడియాలో మంత్రి సబితపైనా.. స్కూళ్లకు సెలవుల్ని లేటుగా ప్రకటన చేయటంపైనా చెడుగుడు ఆడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   21 July 2023 4:59 AM GMT
మంత్రి సబితమ్మకు ఏమైంది? స్కూళ్లకు సెలవు పై షాకులు
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత రాజకీయ నేతలు చాలామంది ఉన్నా.. మహిళా నేతల విషయానికి వస్తే.. సబితా ఇంద్రారెడ్డి పేరు చెప్పినంతనే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివంగత మహానేత వైఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారు. చేవెళ్ల చెల్లెమ్మగా అందరికి తెలిసిన సబితను.. సొంత సిస్టర్ లా చూసుకునేవారు వైఎస్. తన ప్రభుత్వంలో కీలక శాఖల్ని ఆమెకు అప్పజెప్పటం.. వాటిని సమర్థంగా నిర్వహించిన తీరు అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత కాంగ్రెస్ లోనే కంటిన్యూ అయి..కేసీఆర్ రెండో సర్కారులో మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు.

విద్యా శాఖా మంత్రిగా ఉన్న ఆమె.. తాజాగా చేసిన ఒక ప్రకటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గురువారం.. శుక్రవారం స్కూళ్లకు సెలవును ప్రకటిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు.

ఇదే విషయాన్ని ట్విటర్ లో ట్వీట్ చేయటం ద్వారా ప్రజలకు సమాచారం అందించారు. అయితే.. ఈ ట్వీట్ గురువారం ఉదయం 8.18 గంటల వేళలో చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఉదయం ఎనిమిది గంటలకు దాదాపుగా స్కూళ్లకు వెళ్లాల్సిన పిల్లలు అందరూ స్కూళ్లకు బయలుదేరి ఉంటారు. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. స్కూళ్లకు సెలవు ప్రకటించాల్సిన విషయాన్ని విద్యా శాఖా మంత్రిగా నిర్ణయం తీసుకోవటంలో అంత ఆలస్యమా? అన్నది ఒక ప్రశ్న అయితే.. సెలవు విషయాన్ని పేర్కొంటూ చేసిన ట్వీట్ లో.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు అన్న మాటపై మండిపాటు వ్యక్తమవుతోంది.

స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవు అంశాన్ని విద్యాశాఖకు మంత్రిగా ఉన్న సబిత తీసుకోలేరా? ఆ విషయాన్ని సీఎం సూచన చేయాల్సిందేనా? అంటూ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మంత్రి సబితపైనా.. స్కూళ్లకు సెలవుల్ని లేటుగా ప్రకటన చేయటంపైనా చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వరంగల్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే ఏకంగా మంత్రి సబితకు ఫోన్ చేశారు.

మేడమ్.. వర్షాలపై వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది కదా? మీరు గురువారం ఉదయం పిల్లలు స్కూళ్లకు వెళ్లిన తర్వాత సెలవు ప్రకటించటం ఏమిటి? దాని వల్ల ఫలితం ఏమిటి? అని ప్రశ్నించగా.. రోజులా తుంపర్లు పడతాయనుకున్నామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్కూళ్లకు సెలవు ప్రకటించాలని చెబితే తాను ప్రకటన చేశానంటూ మంత్రి సబిత చేసిన వ్యాఖ్యల ఆడియో వైరల్ గా మారింది.

సీనియర్ మంత్రిగా వ్యవహరిస్తూ.. స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ప్రకటించే విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. సబితమ్మ ఇలా అయిపోయారేంటి? అన్నది ప్రశ్నగా మారింది.