Begin typing your search above and press return to search.

కవిత అరెస్టు కాకుండా కేసీఆర్ ఈడీని మేనేజ్ చేశారన్న రాజగోపాల్ రెడ్డి?

By:  Tupaki Desk   |   22 July 2023 3:54 AM GMT
కవిత అరెస్టు కాకుండా కేసీఆర్ ఈడీని మేనేజ్ చేశారన్న రాజగోపాల్ రెడ్డి?
X

గతంతో పోలిస్తే ఇప్పటి రాజకీయం మారిపోయింది. పవర్ ఫుల్ ప్లేస్ లో ఉండే వారి అడుగులకు మడుగులు వత్తటం తప్పించి.. తమ మనసులోని మాటల్ని ధైర్యంగా చెప్పే సాహసవంతులైన నాయకులు ఇప్పుడు కనిపించట్లేదు. అధికార పార్టీలో భూతద్దం వేసినా కనిపించని ఈ తరహా నేతలు.. విపక్షాల్లో ఉండటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.

పార్టీ తీసుకున్న నిర్ణయాలు నచ్చని వేళ.. ఓపెన్ గా చెప్పేసే నేతలకు.. రాజకీయంగా తిప్పలు ఎదురుకావొచ్చు. అయినప్పటికీ ఆ అపాయాన్ని ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న తీరు చూసినప్పుడు.. మారిన కాలానికి అనుగుణంగా మారన నేతలు కొందరైనా ఉన్నారా? అన్న భావన కలుగుక మానదు.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు తెలంగాణ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీలో చేరేందుకు తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి.. ఉప పోరుకు వెళ్లి.. తీవ్రంగా శ్రమించినప్పటికీ సానుకూల ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయిన ఆయన.. ఓడినా తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. తాజాగా కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే వేళలో.. మాట్లాడిన ఆయన.. అనూహ్య రీతిలో వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి జోష్ వచ్చిందంటే దానికి కారణం బండి సంజయ్ అని.. ఈ రోజు సంజయ్ ను చూసి కళ్లలో నీళ్లు తిరిగితే బాత్రూం వెళ్లి ఏడ్చానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుభమా అని కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన వేళ.. అదే వేదిక మీద తన ఏడుపు సీన్ గురించి చెప్పిన వైనం చూస్తే.. బండి మీద తనకున్న అభిమానాన్ని దాచుకునేది లేదన్న విషయాన్ని రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పేసినట్లైంది.

అదే వేదిక మీద మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఢిల్లీ వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈడీని మేనేజ్ చేశారని.. ఎమ్మెల్సీ కవితను అరెస్టు కాకుండా చేశారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ మద్యం స్కాంను కేంద్రంలోని మోడీ సర్కారు ప్రత్యేకంగా మానిటర్ చేస్తుందన్న మాటలు జోరుగా వినిపిస్తున్న వేళ.. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు ఈడీని ముఖ్యమంత్రి కేసీఆర్ మేనేజ్ చేశారన్న ఆరోపణ షాకింగ్ గా మారింది.

ఆయన నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్య సీఎం కేసీఆర్ కంటే కూడా బీజేపీ అధినాయకత్వానికి మరింత సూటిగా గుచ్చుకుంటుందన్న వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ తగ్గకుండా తన మనసులో ఉన్న మాటను యథాతధంగా చెప్పేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది.