తీవ్ర విషాదం... కుమారుడిని కోల్పోయిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి!
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది
By: Tupaki Desk | 27 July 2023 1:40 PM GMTపటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (30) గుండెపోటుతో మృతి చెందాడు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు.
అవును... అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణువర్ధన్ రెడ్డి గత మూడు రోజులుగా హైదరబాద్ లోని నానక్ రాం గుడాలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజాన 2:30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య కిరణ్మయి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే... మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హుటాహుటున బయలుదేరి వెళ్లారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. నియోజకవర్గంలో తండ్రితో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఎన్నికల సమయంలో తండ్రి తరపున ప్రచారం నిర్వహించేవారు. దీంతో నియోజకవర్గంలోని బీఆరెస్స్ నేతలు, కార్యకర్తలతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.
ఇలా విష్ణువర్ధన్ రెడ్డి చిన్న వయస్సులోనే మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక బీఆరెస్స్ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ పార్టీల నేతలు విష్ణువర్ధన్ రెడ్డికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
కాగా.. మహిపాల్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు పటాన్ చెరు నియోజకవర్గం నుంచి బీఆరెస్స్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి పోటీలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు అని తెలుస్తుంది!