Begin typing your search above and press return to search.

కోస్తే రూ.కోటి: మన టమాటా రైతు సుడి ఎంతంటే?

ధైర్యే సాహసే లక్ష్మీ.. అని ఊరికే అనలేదు

By:  Tupaki Desk   |   22 July 2023 4:41 AM GMT
కోస్తే రూ.కోటి:  మన టమాటా రైతు సుడి ఎంతంటే?
X

ధైర్యే సాహసే లక్ష్మీ.. అని ఊరికే అనలేదు. డబ్బులు సంపాదించాలని అనుకోగానే సరిపోదు. అందుకు తగ్గట్లు కష్టపడాలి. ధైర్యం చేయాలి. కీలక సందర్భాల్లో సాహసం చేయాలి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి కరుణిస్తుందంటారు. ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజమన్న విషయాన్ని నిరూపించారు బాన్సువాడకు చెందిన టమాటా రైతు మహిపాల్ రెడ్డి. కొద్ది నెలలుగా చుక్కల్ని అంటుతున్న టమాటా ధర గురించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి.

అక్కడ ఆ రైతు అంత లాభపడ్డాడు.. ఇక్కడ ఈ రైతు ఇంతలా సుడి తిరిగిందని. తాజాగా తెలంగాణకు చెందిన టమాటా రైతు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సుడి అంటే ఆయనదే అంటున్నారు కానీ.. అతగాడు చేసిన సాహసాన్ని గుర్తించటం లేదనే చెప్పాలి.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్ నగర్ కు చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డికి సొంతూరులో 20 ఎకరాల భూమి ఉంది. దీనికి అదనంగా కౌడిపల్లిలో 55 ఎకరాలు.. ముట్రాజిపల్లిలో 25 ఎకరాల్ని కౌలుకు తీసుకొని వివిధ పంటల్ని సాగు చేస్తుంటాడు. మిగిలిన రైతుల మాదిరి కాకుండా పంట సాగులో భిన్నత్వంతో పాటు.. కొత్త తరహా మార్కెటింగ్ వ్యూహాలతో ముందుకు వెళుతుంటాడు.

ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. పంట సాగులో కొత్త పద్దతులపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటాడు. సరికొత్త విధానాల్ని ఫాలో అవుతుంటాడు. మొత్తం వంద ఎకరాల్లో 60 ఎకరాల్లో సన్న బియ్యం.. మిగిలిన 40 ఎకరాల్లో టమాటా.. క్యాప్సికం.. వంగ.. బీర.. కాకరకాయ లాంటి కూరగాయల్ని పండిస్తూ ఉంటాడు. టమాటాకు ప్రతి ఏడాది జూన్ కు ధర పెరుగుతుందన్న అంచనాకు తగ్గట్లుగా పంట వేస్తాడు. ఈసారి ఏప్రిల్ 15న సాహు రకం టమాటా విత్తనాల్ని నాటాడు. రెండు నెలల తర్వాత అంటే జూన్ 15 నుంచి దిగుబడి మొదలైంది.

అప్పటికే టమాటా ధర ఆకాశాన్ని అంటుతున్న వేళ.. సరిగ్గా అదే సమయంలో దిగుబడి రావటంతో లాభాల పంట పండింది. ఇప్పటివరకు 7 వేల టమాటా బాక్సులు (ఒక్కో బాక్స్ లో 25 కేజీలు ఉంటాయి.ధర రూ.2300 నుంచి రూ.2500 వరకు) అమ్మాడు. దీంతో రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చింది.

మరో 5 వేల బాక్సుల వరకు దిగుబడి రానుంది. అంటే.. మరో రూ.కోటి వరకు ఆదాయం. అయితే.. ఈ ఆదాయం చూసినంతనే ఆసూయ కలగొచ్చు. కానీ.. మర్చిపోకూడని విషయం ఏమంటే.. ఇందుకోసం మహిపాల్ రూ.30 లక్షల భారీ పెట్టుబడి పెట్టారన్నది. ధర పెరగకుంటే.. ఆయన పరిస్థితేంటి? అన్నది చూసినప్పుడు.. సదరు రైతు రిస్కును అభినందించకుండా ఉండలేం.