Begin typing your search above and press return to search.

అత్యంత ధనికుల నియోజకవర్గంలో ఈసారి టికెట్‌ ఎవరికి?

ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

By:  Tupaki Desk   |   22 July 2023 6:03 AM GMT
అత్యంత ధనికుల నియోజకవర్గంలో ఈసారి టికెట్‌ ఎవరికి?
X

ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. సామాజికవర్గ సమీకరణాలు, ఆర్థిక, అంగ బలాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే అత్యంత ధనికుల నియోజకవర్గంగా పేరున్న జూబ్లీహిల్స్‌ లో పోటీ చేసే అభ్యర్థులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జూబ్లీహిల్స్‌ లో ప్రముఖ నటీనటులు, బడా రాజకీయనేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, బిలియనీర్లు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్‌ ఉన్నారు. ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం తొలిసారి ఏర్పడింది. ఎర్రగడ్డ, షేక్‌ పేట, బోరబండ, యూసుఫ్‌ గూడ, శ్రీనగర్‌ కాలనీలో కొంత భాగం ఈ నియోజకవర్గంలో భాగాలుగా ఉన్నాయి.

2009లో తొలిసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి దివంగత మంత్రి పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్దన్‌ రెడ్డి గెలుపొందారు. ఇక 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్‌ విజయం సాధించారు. 2018లో మాగంటి గోపీనాథ్‌ బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు.

వచ్చే ఎన్నికల్లోనూ అధికార బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే గత పదేళ్లుగా ఆయనే ఎమ్మెల్యేగా ఉండటంతో కొంత వ్యతిరేకత ఉందని అంటున్నారు. అలాగే టికెట్‌ కోసం గోపీనాథ్‌ కు జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, తెలంగాణ విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా ఉన్న రావుల శ్రీధర్‌ రెడ్డిలతో పోటీ ఎదురవుతోంది. తమకే టికెట్‌ కేటాయించాలని ఫసియుద్దీన్, రావుల శ్రీధర్‌ రెడ్డి కోరుతున్నారని తెలుస్తోంది.

రావుల శ్రీధర్‌ రెడ్డి గతంలో బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ లోకి వచ్చారు. ఆయనకు కేటీఆర్‌ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే గోపీనాథ్‌.. రావులకు చెక్‌ పెట్టేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందులోనూ హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథే ఉన్నారు.

ఇక బీజేపీ తరఫున ప్రముఖ సామాజికవేత్త కీర్తి రెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన లంకాల దీపక్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. వీరితో పాటు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్‌ పద్మ కూడా టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ తరఫున దివంగత మంత్రి పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్దన్‌ రెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. ప్రస్తుతం విష్ణు అంత యాక్టివ్‌ గా లేరని చెబుతున్నారు. ఆయన సోదరి విజయారెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి కాంగ్రెస్‌ టికెట్‌ లభించవచ్చని చెబుతున్నారు. మరి ఆయా పార్టీల తరఫున టికెట్‌ ఎవరికి లభిస్తుందో వేచిచూడాల్సిందే.