Begin typing your search above and press return to search.

రేవంత్ కు భారీ ఊరట.. కేసీఆర్ సర్కారుకు హైకోర్టు ఆక్షింతలు

జీవోలను సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకునే తీరు కేసీఆర్ సర్కారులో అంతకంతకూ ఎక్కువ అవుతోంది

By:  Tupaki Desk   |   29 July 2023 4:50 AM GMT
రేవంత్ కు భారీ ఊరట.. కేసీఆర్ సర్కారుకు హైకోర్టు ఆక్షింతలు
X

సమస్య కొత్తదేం కాదు పాతదే. ప్రభుత్వాన్ని అడిగే సమాచారాన్ని ఇవ్వకుండా దాచి ఉంచటం.. గోప్యత పాటించటం.. జీవోలను సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకునే తీరు కేసీఆర్ సర్కారులో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. సామాన్యుల సంగతిని పక్కన పెడితే.. ప్రముఖులు.. చట్టసభ సభ్యులు చట్టబద్ధంగా అడిగినప్పటికి సమాచారం ఇవ్వకుండా ఉంటున్న తీరు ఇప్పుడు షాకింగ్ గా మారుతోంది. దీనిపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది తెలంగాణ హైకోర్టు.

అవుటర్ రింగు రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తనకు ఇవ్వాలని.. దానికి సంబంధించిన వివరాల్ని ఇవ్వమని కోరితే సరిగా స్పందించని ప్రభుత్వం తీరును తప్పు పడుతూ హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ ఎంపీ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ పిటిషన్ లో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి.. హెచ్ఎండీఏ.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీని ప్రతివాదులుగా చేర్చారు.

ఈ పిటిషన్ పై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనల్ని వినిపిస్తూ.. సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టటం లేదని.. కాంట్రాక్టు ఎలా ఇచ్చారో సమాచారాన్ని ఇవ్వట్లేదన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. చట్టప్రకారం సాధారణ పౌరులు అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోతే ఆర్టీఐ చట్టం మూల సిద్ధాంతం దెబ్బ తిన్నట్లేనని పేర్కొన్నారు.

ప్రజల చేత ఎన్నికైన ఎంపీకే సమాచారాన్ని ఇవ్వకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ధర్మాసనం.. ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిదులు ఏ సమాచారం అడగకుండా.. ఏమీ మాట్లాడకుండా నిశ్శబద్దంగా ఉండాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించింది. ఒక ఎంపీ అడిగిన సమాచారన్ని ఇవ్వకపోతే పార్లమెంటులో చర్చలు ఎలా జరుగుతాయని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. చట్టప్రకారం అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

హెచ్ఎండీఏ లాంటి ప్రభుత్వ సంస్థ అవుటర్ రింగ్ రోడ్డు టెండర్ అంశంపై ఒక ఎంపీ మాట్లాడకుండా సివిల్ కోర్టును ఎలా ఆశ్రయిస్తుందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఏజీ.. ఆర్టీఐ చట్టపరిధిలోని నిబంధనల ప్రకారం తప్పకుండా సమాచారం ఇస్తామని.. చట్టంలో కొన్ని పరిమితులు కూడా విధించారన్నారు. ఈ అంశంపై వివరాలు అందించేందుకు రెండు వారాల సమయం ఇవ్వలని కోరటంతో అందుకు తగ్గట్లు వాయిదా వేశారు.

ఇప్పటికే అవుటర్ రింగు రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేసిన ఉదంతంపై ఇప్పటి పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు రావటం తెలిసిందే. ఇదో భారీ స్కాంగా విపక్షాలు విరుచుకుపడుతుంటే.. అధికారపక్షం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. పలు జాతీయ రహదారుల్ని కేంద్ర ప్రభుత్వం లీజుకు ఇస్తోందన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎంపీ రేవంత్ రెడ్డి మొదట్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం కోసం రేవంత్ హైకోర్టును ఆశ్రయించిన వేళ.. కేసీఆర్ సర్కారుకు ఆక్షింతలు పడ్డాయి.