Begin typing your search above and press return to search.

బీజేపీకి బీసీలు దూరమవుతున్నారా ?

దీనికి కారణం ఏమిటంటే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షస్ధానం నుండి తప్పించటమే

By:  Tupaki Desk   |   26 July 2023 11:30 PM GMT
బీజేపీకి బీసీలు దూరమవుతున్నారా ?
X

తెలంగాణా బీజేపీలో ఇపుడు ఇదే చర్చ జరుగుతోంది. పార్టీలోని బీసీ నేతల మధ్య ఇపుడిదే కీలకమైన చర్చగా మారింది. దీనికి కారణం ఏమిటంటే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షస్ధానం నుండి తప్పించటమే. బండిని తప్పించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పార్టీ అగ్రనేతలు అధ్యక్షుడిగా నియమించారు.

దీంతో పార్టీలోని ఒక వర్గం నేతల్లోను, చాలామంది కార్యకర్తలతోను ఒకవిధమైన నైరాస్యం మొదలైంది. ఇదే విషయాన్ని పార్టీలోని బీసీ లీడర్లు తెలంగాణా ఇన్చార్జి సునీల్ బన్సల్ కు చెప్పారని ప్రచారం మొదలైంది.

మామూలు కార్యకర్తగా మొదలుపెట్టి ఎంపీగా గెలిచి పార్టీ అధ్యక్షుడిగా ఎదిగిన బండిని తప్పించాల్సిన అవసరం ఏమిటని నేతలు బన్సల్ ను నిలదీశారట. బండి అధ్యక్షుడిగా పగ్గాల స్వీకరించకుముందు పార్టీ ఎలాగుండేది తర్వాత ఎలాగుందో అందరికీ తెలిసిందే అని నేతలు చెప్పారట.

బండికన్నా ముందు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉండేవారు. లక్ష్మణ్ కూడా బీసీ నేతలే అయినప్పటికీ పార్టీలో ఏదో నిస్సత్తువ ఆవరించుండేది. వివిధ కారణాలతో లక్ష్మణ్ ను తొలగించి ఆ ప్లేసులో బండికి పగ్గాలను అప్పగించింది.

బండికి పగ్గాలు అప్పగించిన తర్వాతే పార్టీలో జోరుపెరిగిందన్నది వాస్తవం. బీసీనేతలు చెప్పారనో లేకపోతే అనుకుంటున్నారనో కాదుకానీ అదే వాస్తవం కూడా. ఎంతసేపు బండి తన ఆరోపణలు, విమర్శలను కేసీయార్ కుటుంబం చుట్టూనే తిప్పినా మొత్తంమీద పార్టీని పరుగులు పెట్టించారు.

కిందస్ధాయి నుండి పై స్ధాయివరకు పార్టీలో జోష్ నింపారు. బండి మాటల్లో లాజిక్కుండదు, మ్యాజిక్ అంతకన్నా ఉండదు. కానీ కేసీయార్ కుటుంబంపై కసిమాత్రం బండి ఆరోపణలు, విమర్శల్లో కనబడేది.

రెగ్యులర్ గా ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ కు వెళ్ళి ఎంఐఎం నేతలను సవాళ్ళు చేసేవారు. ఇలా రకరకాల కారణాలతో ఏదో కార్యక్రమాలను పెట్టుకుని పార్టీ నేతలు, కార్యకర్తలను ఎప్పుడూ బిజీగా ఉంచేవారు. అందుకనే పార్టీలో బాగా జవసత్వాలుండేవి. అలాంటిది సడెన్ గా బండిని తీసేసి కిషన్ కు అప్పగించటంతో జోష్ మొత్తం పోయింది.

సరే దీనివెనుకా ఏదో రాజకీయ కారణాలు ఉంటాయని అందరు అనుకుంటున్నదే. అందుకనే పార్టీలోని బీసీ నేతల్లో ప్రముఖులు తొందరలోనే తమ దారి తాము చూసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదనే టాక్ పెరిగిపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.