Begin typing your search above and press return to search.

చైనాకు చెక్: AI సప్ల‌య్ చైన్ ర‌క్ష‌ణ‌కు భార‌త్ స‌హా 9 దేశాల ఒప్పందం!

ప్రపంచ ఏఐ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో భారత్ సహా తొమ్మిది దేశాలు నవంబర్ 15న సంయుక్త ప్రకటనపై సంతకం చేశాయి. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ ఇందులో భాగమయ్యాయి. సెమీకండక్టర్లు, హార్డ్‌వేర్, ముడి పదార్థాల సరఫరాలో అంతరాయాలు లేకుండా పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.

By:  Sivaji Kontham   |   17 Nov 2026 1:00 AM IST
చైనాకు చెక్: AI సప్ల‌య్ చైన్ ర‌క్ష‌ణ‌కు భార‌త్ స‌హా 9 దేశాల ఒప్పందం!
X

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వ్యూహాత్మక భద్రతను పెంపొందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సప్లై చైన్‌ను చైనా ఆధిపత్యం నుంచి రక్షించుకునే లక్ష్యంతో భారత్ సహా తొమ్మిది దేశాలు ఒక ప్రత్యేక ఒప్పంద ప్ర‌క‌ట‌న‌పై సంతకం చేశాయి. జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. నవంబర్ 15న జరిగిన ఈ ఒప్పందంలో ప‌లు దేశాలు ఓ చోట స‌మావేశ‌మై దీనిపై తీవ్రంగా చ‌ర్చించాయి.

ఈ వ్యూహాత్మక ప్రకటనపై సంతకం చేసిన దేశాల జాబితాలో అమెరికా, భార‌త‌దేశం, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణ కొరియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ) ఉన్నాయి. ప్రపంచ టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించే కీలక మౌలిక సదుపాయాలు - ఏఐ సాంకేతికతకు అవసరమైన ముడి పదార్థాలు, హార్డ్‌వేర్ కొరత లేకుండా చూసుకోవడం ఈ దేశాల ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుతం ఏఐ రంగంలో హార్డ్‌వేర్, సెమికండక్టర్లు .. ఇతర కీలక పరికరాల తయారీలో కొన్ని దేశాలకే ప్రాధాన్యత ఉండటంతో సరఫరా చైన్‌లో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు ఈ తొమ్మిది దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. టెక్నాలజీ రంగంలో భద్రతను పెంపొందించడంతో పాటు.. పారదర్శకమైన, నమ్మకమైన సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఈ సంయుక్త ప్రకటన మార్గం సుగమం చేస్తుంది.

ఈ అంతర్జాతీయ కూటమిలో భారతదేశం భాగస్వామి కావడం ద్వారా ఏఐ టెక్నాలజీ రంగానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యత మరోసారి స్పష్టమైంది. భవిష్యత్తులో గ్లోబల్ టెక్ మార్కెట్‌లో చైనా లేదా ఇత‌ర దేశాల నుంచి ఏకపక్ష ఆధిపత్యాలను అడ్డుకుంటూ.. సమాన అవకాశాలు, రక్షణ కల్పించే దిశగా ఈ దేశాల ఒప్పందం ఒక చారిత్రక అడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మొత్తం 9 దేశాల‌తో భారత్ స‌త్సంబంధాల‌ను మ‌రింత మెరుగ్గా కొన‌సాగించేందుకు కూడా ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక భార‌త‌దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత భారీగా ఏఐ డేటా సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌తిష్ఠాత్మ‌క‌ గూగుల్ డేటా సెంట‌ర్ తో పాటు, రిల‌య‌న్స్ డేటా సెంట‌ర్, ఆర్.ఎం.జెడ్ అండ్ కో డేటా సెంట‌ర్ వంటివి అత్యంత కీల‌క‌మైన‌వి. ఈ సంస్థ‌లు డేటా సెంట‌ర్ల కోసం లక్ష‌ల కోట్లు వెచ్చిస్తుండడం ప్ర‌ధానంగా చ‌ర్చనీయాంశ‌మైంది. వీటి కోసం వంద‌ల ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వాలు అందిస్తున్నాయి.