తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?
ఏఐ తనను తాను మెరుగుపరుచుకుంటూ, తనకంటే శక్తిమంతమైన కొత్త ఏఐలను సృష్టించే స్థాయికి చేరే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనినే 'రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్' అంటారు. ఏఐ అభివృద్ధి వేగంపై ఆంత్రోపిక్ సంస్థ కూడా అమెరికా ఎస్ఈసీకి హెచ్చరికలు చేసింది. మానవ నియంత్రణ కోల్పోకుండా ఏఐ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
By: A.N.Kumar | 6 Nov 2026 9:00 PM ISTమనం బొమ్మలు గీసి ఆడుకోవడానికి తెచ్చుకున్న చిన్నారి బొమ్మే రేపు మనకంటే పెద్ద గూండాగా తయారై మనకే రివర్స్ లో పంచ్‌లు ఇస్తే ఎలా ఉంటుంది..? సరిగ్గా ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచం ఎదుర్కొంటున్న భయంకరమైన కామెడీ ఇదే.. ఒకనాడు మనిషి తన బద్ధకాన్ని వదిలించుకోవడానికి.. శ్రమను తగ్గించుకోవడానికి చిన్న చిన్న యంత్రాలను సృష్టించాడు. ఆ యంత్రాలు చక్రాలై కదిలాయి, కంప్యూటర్లై ఆలోచించాయి.. ఇంటర్నెట్ రూపంలో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపాయి. చివరకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో దేవుడిలా సృష్టికర్త పాత్ర పోషించాలనుకున్నాయి. మనం అడిగిన అక్షరాలను పదాలుగా మార్చడం నుంచి.. ప్రాణాలను కాపాడే వైధ్య పరిశోధనల వరకు అన్నీ తానై నడిపిస్తోన్న ఏఐ... ఇప్పుడు తనకంటే శక్తిమంతమైన మరో సృష్టిని తానే చేయబోతుందా? మనిషికి ప్రత్యామ్నాయంగా ఎదిగే స్థాయికి చేరుకుందా? ఇదే ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచాన్ని నిద్రపోనివ్వని అతిపెద్ద కలవరం..
ఇప్పటివరకు ఏఐని పెంచి పెద్ద చేయడానికి వేలాది మంది సైంటిస్టుల మెదళ్లు.. నెలల తరబడి ప్రయోగాలు అవసరమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. తప్పులను సరిదిద్దడం.. కోడింగ్ రాయడం.. కొత్త మోడళ్లకు రూపకల్పన చేయడం వంటి పనులను ఏఐ తనంతట వేగంగా చేసుకుంటూ పోతోంది. ఇదే కొనసాగితే... రేపు తన తర్వాతి తరాన్ని.. తనకన్నా వంద రెట్లు శక్తిమంతమైన మరో ఏఐని అదే సృష్టించుకోగలదు. దీనినే సాంకేతికంగా 'రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్' అంటారు. అంటే తనను తాను మెరుగుపరుచుకుంటూ దేవుడి స్థాయికి ఎదిగే ప్రమాదకర ప్రయాణం.. మన రోబో సినిమాలో చూపించినట్టు ఒక రోబో తనలాంటి వంద రోబోలను సృష్టించి వినాశనం సృష్టించడం అన్న మాట..
ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' చేసిన హెచ్చరికలు ఈ భయాలను నిజం చేస్తున్నాయి. ఏఐ సాయంతో మరింత అడ్వాన్స్డ్ ఏఐల తయారీ ఊహకందని వేగంతో దూసుకుపోతోందని.. ఇది సమీప భవిష్యత్తులోనే జరగవచ్చని ఆ సంస్థ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు వెల్లడించింది. ఇక్కడ అసలు ముప్పు సినిమాల్లో చూపించినట్లు ఏఐ మనుషులపై తిరుగుబాటు చేయడం కాదు.. దాని వేగాన్ని మనం అందుకోలేకపోవడమే.. ఒక కొత్త మోడల్ లోపాలను సరిదిద్దేలోపే.. అంతకంటే శక్తిమంతమైన మరో రాక్షస బ్రైన్ పుట్టుకొస్తే... దానిని నియంత్రించడం మానవజాతికి అసాధ్యమైపోతుంది.
అమెరికా మాత్రమే కాదు.. భారత్ లాంటి దేశాలు కూడా ఈ సాంకేతిక సునామీని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అభివృద్ధి వేగం ముఖ్యం కావచ్చు.. కానీ మానవ నియంత్రణను కోల్పోతే ఈ సృష్టి మన వినాశనానికే దారితీస్తుంది. మనం సృష్టించిన ఈ అద్భుతం మన ఉనికికే ముప్పుగా మారకముందే బాధ్యతాయుతమైన కళ్లెం వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
