OTT టాక్: నరివెట్ట.. కంటెంట్ క్లిక్కయ్యిందా లేదా?
అలాంటి ప్రయత్నంగా తాజాగా మలయాళ భాషలో తెరకెక్కిన 'నరివెట్ట' సినిమా ఇప్పుడు 'సోనీ లివ్' ఓటీటీ వేదికగా తెలుగులో డబ్బింగ్ తో అందుబాటులోకి వచ్చింది.
By: Tupaki Desk | 12 July 2025 3:16 PM ISTవాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ కూడా ప్రమోషన్ తో సంబంధం లేకుండా ఎట్రాక్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా సామాజిక అంశాల ఆధారంగా వచ్చిన చిత్రాలు మరింత భావోద్వేగాన్ని కలిగిస్తాయి. అలాంటి ప్రయత్నంగా తాజాగా మలయాళ భాషలో తెరకెక్కిన 'నరివెట్ట' సినిమా ఇప్పుడు 'సోనీ లివ్' ఓటీటీ వేదికగా తెలుగులో డబ్బింగ్ తో అందుబాటులోకి వచ్చింది. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక వాస్తవ సంఘటన చుట్టూ సాగుతుంది.
కేరళలోని వయనాడ్ అడవి చుట్టూ ఈ కథ సాగుతుంది. అక్కడ గిరిజనులు తమ హక్కుల కోసం చేసిన పోరాటం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న చర్యలు ఈ కథకు ప్రధానాంశం. కథలో వర్ఘీస్ పీటర్ అనే యువకుడు కానిస్టేబుల్ గా విధుల్లో చేరడం, అతడి కళ్లముందే జరిగిన హత్య, అనంతరం జరిగే పరిణామాలే కథను ముందుకు తీసుకెళ్తాయి. మొదటి అరగంట కథకు పెద్దగా ప్రయోజనం లేకుండా ఉండగా, వయనాడ్ కి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.
ఈ సినిమాలో చూపించిన సామాజిక అంశం, పోలీస్ వ్యవస్థ బ్రూటాలిటీకి సంబంధించిన సన్నివేశాలు నిజంగా ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. కానీ దర్శకుడు ఈ కథను గిరిజనుల కోణం నుంచి చూపకుండా, వర్ఘీస్ అనే బయట వ్యక్తి అభిప్రాయాలతో చెప్పడమే పెద్ద మైనస్. అది కథలో ఉండాల్సిన ఎమోషన్‌ను బలహీనపరచింది. టొవినో నటన బాగా ఉన్నా, పాత్రకు అంత బలం రాలేదు.
అలాగే వర్ఘీస్ ప్రేమకథ, ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు వంటివి కథకు ఎటువంటి బలం ఇవ్వలేదు. అసలైన కథలోకి ప్రవేశించడానికి చాలా సమయం తీసుకోవడం ఆడియెన్స్ కనెక్ట్‌ను తగ్గించేసింది. అయితే చివరి 40 నిమిషాల్లో కథ మలుపు తిప్పే విధానం, పాత్రల భావోద్వేగాలు బాగున్నాయి. ప్రత్యేకంగా గిరిజనుల పట్ల జరిగే అన్యాయాన్ని చూపించిన సన్నివేశాలు బలంగా నిలిచాయి.
బషీర్ పాత్రలో సూరజ్ వెంజరమూడి ఆకట్టుకున్నారు. డీఐజీగా చేరన్, ఇతర సహాయ పాత్రలు సహజంగా నటించారు. సినిమాను రియల్ లోకేషన్లలో చిత్రీకరించడంతో కథకు నమ్మకమైన వాతావరణం ఏర్పడింది. తెలుగు డబ్బింగ్ సహజంగా ఉండటం వల్ల నేటివిటీ ప్రభావం చెడకుండా ఉంది. మొత్తానికి చెప్పాలంటే, ‘నరివెట్ట’ ఓ మంచి ప్రయత్నం. కానీ కొన్ని నెగెటివ్ ట్రీట్మెంట్స్ ఎఫెక్ట్ చూపించాయి. అయినప్పటికీ వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలు ఇష్టమవేవారికి ఇది తప్పకుండా చూడదగిన చిత్రం.
