Begin typing your search above and press return to search.

OTTల‌కు చెక్ పెట్టే రోజు ద‌గ్గర ప‌డింది!

ఈ నేపథ్యంలోనే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ ఛాంబర్) లో కీలక సమావేశం జరిగింది. సురేష్ బాబు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది.

By:  Sivaji Kontham   |   4 March 2026 8:50 PM IST
OTTల‌కు చెక్ పెట్టే రోజు ద‌గ్గర ప‌డింది!
X

టాలీవుడ్ లో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ గ్యాప్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం థియేటర్లలో సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదని పంపిణీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సినిమా విడుదలైన తర్వాత కనీసం 6 నుండి 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు.

బాలీవుడ్‌లో ఇప్పటికే ఈ 8 వారాల గ్యాప్ రూల్ కఠినంగా అమలులో ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ అసోసియేషన్లు- నిర్మాతల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల వరకు ఏ పెద్ద సినిమా కూడా ఓటీటీలో రాకూడదు. దీనివల్ల హిందీ సినిమాలకు లాంగ్ రన్ పెరగడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇదే సూత్రాన్ని టాలీవుడ్‌లోనూ అమలు చేయాలని చర్చలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలోనే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ ఛాంబర్) లో కీలక సమావేశం జరిగింది. సురేష్ బాబు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. థియేట్రికల్ బిజినెస్‌ను కాపాడుకోవాలంటే ఓటీటీ విండోను పెంచడం తప్పనిసరి అని ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో నిర్మించబోయే సినిమాలకు ఈ కొత్త నిబంధనను వర్తింపజేయాలని కమిటీ యోచిస్తోంది.

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ఈ రూల్‌ను ఎలా రూపొందించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. సినిమా థియేటర్లలో ఆడుతున్నప్పుడే ఓటీటీ డేట్ అనౌన్స్ చేయడం వల్ల కలెక్షన్లపై దెబ్బపడుతోందని.. దీనిని నియంత్రించేలా నిబంధనలు ఉండాలని చర్చించారు. అయితే ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది.. దీనిపై ఇంకా అధికారిక ముద్ర పడలేదు. వచ్చే కొన్ని వారాల్లో ఈ అంశంపై మరిన్ని దఫాలుగా చర్చలు జరగనున్నాయి. థియేటర్ల యజమానులు, పంపిణీదారులు .. ఓటీటీ సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఒక తుది నిర్ణయానికి రానున్నారు. టాలీవుడ్ తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో తెలుగు సినిమా ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు.

ప్రస్తుతానికి ఇండస్ట్రీ వర్గాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో 8 వారాల గ్యాప్ అనే నిబంధన బాక్సాఫీస్ వద్ద పూర్వ వైభవాన్ని తెస్తుందని పంపిణీదారులు నమ్ముతున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా సినిమా చూడాలంటే థియేటర్‌కు రావాల్సిందే అనే వాతావరణం ఏర్పడుతుంది.

చిన్న నిర్మాతల చిక్కులు.. ఓటీటీ రూల్ అందరికీ ఒకటేనా?

బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో ఈ `8 వారాల రూల్` అమలు చేయడం వెనుక కొన్ని కీలక చిక్కులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అనే భేదం స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద స్టార్ హీరోల సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి 8 వారాల గ్యాప్ వల్ల వారికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ చిన్న సినిమాల పరిస్థితి వేరు. థియేటర్లలో ఆదరణ లభించని చిన్న సినిమాలను 8 వారాల పాటు ఆపడం వల్ల నిర్మాతలకు వడ్డీల భారం పెరిగే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా థియేటర్లలో పెద్దగా ఆడనప్పుడు లేదా షోలు రద్దయినప్పుడు చిన్న నిర్మాతలకు ఓటీటీ నుండి వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా ఉంటుంది. అటువంటి తరుణంలో అందరికీ ఒకే రూల్ వర్తింపజేస్తే అది చిన్న నిర్మాతలకు ఆర్థికంగా నష్టదాయకమే. ఓటీటీ సంస్థలు కూడా సినిమా రిజల్ట్‌ను బట్టి స్ట్రీమింగ్ డేట్స్‌ను అడ్జస్ట్ చేయాలని కోరుతుంటాయి. ఈ పాయింట్ మీదే ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి.

అందుకే, చిన్న నిర్మాతలకు ఊరటనిచ్చేలా ప్రత్యేకమైన ఓటీటీ రూల్స్ గురించి ఇండస్ట్రీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ పరిమితి లేదా థియేటర్ల సంఖ్యను బట్టి ఈ విండో పీరియడ్‌ను 4 వారాలుగా ఉంచాలా లేక 8 వారాలకు పెంచాలా అనే వెసులుబాటు ఇచ్చేలా నిబంధనలు రూపొందించే అవకాశం ఉంది. చిన్న సినిమాల మనుగడను దృష్టిలో ఉంచుకుని పారదర్శకమైన నిర్ణయం తీసుకుంటేనే అందరికీ న్యాయం జరుగుతుంది.