థియేటర్‌లో యావరేజ్ కానీ ఓటీటీలో మాత్రం..
ఆరు పదులు దాటిన వయసులో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్.
By: Tupaki Desk | 26 Jun 2025 5:00 AM ISTఆరు పదులు దాటిన వయసులో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. ఆయన నటించిన 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. 2023, ఆగస్టు 11న సైలెంట్‌గా విడుదలై మౌత్ టాక్‌తో రికార్డు స్థాయి విజయాన్ని సొతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రూ.690 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన సన్నీ డియోల్ అదే ఊపుతో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.
'గదర్ 2' బ్లాక్ బస్టర్ కావడంతో కొత్త తరహా యాక్షన్ ఎంటర్ టైనర్‌లని ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో యాక్షన్ డ్రామా మూవీ `జాట్` చేశాడు. జీ స్టూడియోస్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించాయి. రెజీనా, సయామీఖేర్ హీరోయిన్‌లుగా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో రణ్‌దీప్ హుడా, జగపతిబాబు, రమ్యకృష్ణ, జరీనా వాహెబ్, రవిశంకర్, అయోషాఖాన్, అజయ్ ఘోష్ నటించారు.
రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.119 కోట్లు మాత్రమే రాబట్టి యావరేజ్‌గా నిలిచి నిరాశపరిచింది. మైత్రీ వారి తొలి హిందీ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే నష్టాలని తెచ్చి పెట్టలేదు..అలా అని లాభాల్ని అందించలేకపోవడంతో మైత్రీ వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రీసెంట్‌గా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన 'జాట్' నెట్ ఫ్లిక్స్‌లో మాత్రం దుమ్ముదులిపేస్తోంది. నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్ టెన్‌లో నిలిచి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ వీక్ 4.1 మిలియన్ వ్యూస్‌తో కొనసాగిన జాట్ రెండవ వారం 3.8 మిలియన్‌లు, మూడవ వారం 1.5 మిలియన్‌ల వ్యూస్‌ని రాబట్టినట్టుగా ఓటీటీ వర్గాలు తెలిపాయి. ఈ మూడు వారాల్లో ఈ యాక్షన్ డ్రామా ఏకంగా 9.4 మిలియన్‌ల వ్యూస్‌ని రాబట్టి సత్తా చాటుకోవడం విశేషం. దీని తరువాత సన్నీ డియోల్ `లాహోర్ 1947`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజ్‌కుమార్ సంతోషీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రతీజింటా, శబానా ఆజ్మీ, శిల్పాశెట్టి నటిస్తున్నారు. ఆమీర్‌ఖాన్ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ మూవీని ఆమీర్‌ఖాన్ నిర్మిస్తున్నాడు.
