ఓటీటీ డీల్: 'వారణాసి'కి 650 కోట్లు-'రామాయణం'కి 700 కోట్లు?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓటీటీ బిజినెస్ ఇప్పుడు కళ్లు చెదిరే స్థాయికి చేరుకుంది.
By: Sivaji Kontham | 4 April 2026 5:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓటీటీ బిజినెస్ ఇప్పుడు కళ్లు చెదిరే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `వారణాసి` (SSMB29) చిత్రానికి దాదాపు రూ. 650 కోట్ల ఓటీటీ డీల్ చర్చల దశలో ఉందని వార్తలు వస్తుండటం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం` కోసం ఏకంగా రూ. 1000 కోట్ల డిజిటల్ రైట్స్ ఆశిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక సినిమాకు సంబంధించి ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడం భారతీయ సినీ చరిత్రలోనే ఇదే తొలిసారి. కానీ ఇది సాధ్యమేనా?
ప్రస్తుత మార్కెట్ లెక్కలను పరిశీలిస్తే... రూ. 1000 కోట్ల ఓటీటీ డీల్ అనేది చాలా అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు `పుష్ప 2` వంటి భారీ క్రేజ్ తో వచ్చిన చిత్రానికే డిజిటల్ హక్కులు రూ. 275 - 300 కోట్ల మధ్య పలికాయి. రాజమౌళి బ్రాండ్ విలువ వల్ల `వారణాసి`కి రూ. 650 కోట్లు రావడం సాధ్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రామాయణం రెండు భాగాలకు కలిపి రూ. 1000 కోట్లు అని చెప్పినా.. ఒక్కో భాగానికి రూ. 500 కోట్లు కేటాయించడానికి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వెనుకాడే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టిస్తేనే ఈ స్థాయి పెట్టుబడి వెనక్కి వస్తుంది. కానీ రామాయణం చిత్రాన్ని నితీష్ తివారీ ఆ రేంజులో రక్తి కట్టించారా లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్.
`రామాయణం` చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 4000 కోట్లుగా ప్రచారం జరుగుతుండటంతో నిర్మాతలు తమ పెట్టుబడిని రికవరీ చేసే క్రమంలో ఓటీటీ రైట్స్ కోసం ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 700 కోట్లు ఆఫర్ చేసిందని.. కానీ నిర్మాతలు దానిని తిరస్కరించారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడై ఉంటే ఆయనకున్న గ్లోబల్ క్రేజ్ దృష్ట్యా రూ. 1000 కోట్ల డీల్ సులభంగా సాధ్యపడేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ నితీష్ తివారీ విషయంలో ఓటీటీ సంస్థలు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటాయా అన్నది అనుమానమే.
ఈ భారీ అంకెల ప్రచారం వెనుక `హైప్ క్రియేషన్` అనే పబ్లిసిటీ స్ట్రాటజీ కూడా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్‌లో రూ. 1000 కోట్ల ఫిగర్ వినిపించడం వల్ల సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరగడమే కాకుండా శాటిలైట్ బిజినెస్ సహా డిస్ట్రిబ్యూషన్ ఏరియాల్లో కూడా భారీ రేట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన రావడం, డిజిటల్ రైట్స్ బిజినెస్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ `రామాయణం` మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద `బాహుబలి2` లేదా `ఆర్ఆర్ఆర్` రేంజ్‌లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తే... అప్పుడు రెండు భాగాలకు కలిపి రూ. 1000 కోట్ల డీల్ సాధ్యపడవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది కేవలం అత్యాశతో కూడిన అంచనాగానే కనిపిస్తోంది. ఓటీటీ సంస్థలు కేవలం స్టార్ పవర్ మాత్రమే కాకుండా.. సినిమా నాణ్యత .. థియేటర్ వసూళ్లను బట్టి డీల్ ని నిర్ణయిస్తాయి కాబట్టి రామాయణం ఓటీటీ డీల్ నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. చాలా వరకూ రామాయణం పార్ట్ 1 విడుదలయ్యాక ఓటీటీ డీల్ మాట్లాడితే అది చిత్రబృందానికి ప్లస్ అయ్యే ఛాన్సుంటుంది. ఒకవేళ మొదటి భాగాన్ని నితీష్ తివారీ బ్లాక్ బస్టర్ చేయగలిగితే అప్పుడు డిజిటల్ లో ఆడిండే ఆట పాడిందే పాటగా మారే ఛాన్సుంటుందని విశ్లేషిస్తున్నారు. అయితే కేవలం ఓటీటీ రైట్స్ కోసం 1000 కోట్లు చెల్లించడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని గ్రహించాలి. 4000 కోట్ల బడ్జెట్ నిజంగా ఖర్చు చేస్తున్నారా? అన్నదానిపై పార్ట్ -1 విడుదలయ్యేకే క్లారిటీ వస్తుంది.
