మరో థ్రిల్లర్ తో వస్తోన్న ప్రియమణి
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌లతో కెరీర్ ను ఫుల్ స్పీడులో నడుపుతున్నారు హీరోయిన్ ప్రియమణి.
By: Tupaki Desk | 27 Jun 2025 12:53 PM ISTఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌లతో కెరీర్ ను ఫుల్ స్పీడులో నడుపుతున్నారు హీరోయిన్ ప్రియమణి. ది ఫ్యామిలీ మెన్, భామా కలాపం వెబ్ సిరీస్ లతో తనదైన నటనతో మెప్పించిన ప్రియమణి, రీసెంట్ గా ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లో నటించి బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రిమయణి ప్రధాన పాత్రలో మరో వెబ్ సిరీస్ చేస్తోన్నారు. అదే గుడ్ వైఫ్.
జులై 4 నుంచి జియో హాట్‌స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలు సహా ఏడు భాషల్లో గుడ్ వైఫ్ రిలీజ్ అవుతోంది. ఈ సిరీస్ లో ప్రియమణితో పాటూ సంపత్ రాజ్, రేవతి, ఆరి అర్జునన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా గుడ్ వైఫ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
గుడ్ వైఫ్ లో ప్రియమణి తరుణిక అనే తల్లి పాత్రలో నటిస్తున్నారు. అప్పటివరకు ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ప్రియమణి సడెన్ గా కోర్టు రూమ్ లోకి లాయర్ గా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గుడ్ వైఫ్ లో ప్రియమణికి భర్త పాత్రలో సంపత్ రాజ్ నటించగా, ఆయన స్కామ్ లో చిక్కుకుని అరెస్టవుతారు. భర్త అరెస్ట్ తో తరుణిక లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. తన భర్తను కాపాడుకోవడానికి భార్య ఏం చేసింది? అసలామె లాయర్ గా ఎలా మారింది? ఈ ఒంటరి పోరాటంలో తరుణిక విజయం సాధించిందా? అసలు ఆమె భర్త అరెస్ట్ వెనుక ఇంకేదైనా కారణముందా లాంటి ప్రశ్నలు చాలా ఉన్నప్పటికీ ట్రైలర్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించింది.
అమెరికన్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుండగా, నటి, డైరెక్టర్ రేవతి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. గుడ్ వైఫ్ రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికీ ఇందులో కోర్టు సీన్స్, డ్రామా చాలా స్పెషల్ గా ఉండటంతో పాటూ ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు చేసిన కొన్ని మార్పులు సిరీస్ కు ప్లస్ కానున్నాయి. ఇందులో ప్రియమణి లీడ్ రోల్ లో నటిస్తున్నప్పటికీ ఆమె అలా కనిపించకుండా, చాలా నేచురల్ గా ఒక సాధారణ కుటుంబంలోని భార్య, తన భర్త ఓ కేసులో ఇరుక్కుంటే ఏం చేస్తుందో అలానే కనిపిస్తూ చాలా సెటిల్డ్ గా నటించినట్టు అర్థమవుతుంది. జులై 4న ఈ సిరీస్ రిలీజ్ కానున్నప్పటికీ ఇంకా గుడ్ వైఫ్ కు కావాల్సినంత హైప్ రాలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మెల్లిగా సిరీస్ పై అందరికీ ఆసక్తి పెరుగుతుంది.