నెట్ ఫ్లిక్స్ పెరుసు.. పబ్లిక్ టాక్ ఇలా..
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 15 April 2025 10:27 AM ISTప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ వీకెండ్ కు కామెడీ డ్రామా పెరుసు మూవీని తీసుకొచ్చింది. అయితే తమిళంలో థియేటర్లలో విడుదలై మంచి హిట్ అయిన ఆ మూవీ తెలుగు వెర్షన్ ను ఇప్పుడు స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ఆ చిత్రం ఎలా ఉంది.. పబ్లిక్ టాక్ ఏంటి..
వైభవ్, సునీల్ రెడ్డి, నిహారిక ఎన్ ఎం లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన పెరుసు మూవీని శ్రీలంక మూవీ టెంటిగో ఆధారంగా ఇళంగో రామ్ దీన్ని తెరకెక్కించారు. కార్తేకేయన్ సంతానం, హర్మాన్ బవేజా, హిరణ్య పెరెరా నిర్మించారు. చాందిని తమిళరసన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే మూవీ స్టోరీ లైన్ ఇలా..
ఒక ఇంటి పెద్ద అంగస్తంభనతో మరణించినప్పుడు ఒక్కసారిగా గందరగోళం ఏర్పడుతుంది. ఓ వైపు వృద్ధుడు చనిపోయారని బాధ.. మరోవైపు ఆ సమస్య గురించి ఊరి వాళ్లకు తెలిస్తే పరువు పోతుందనే భయం.. అలా ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేయలానుకుంటారు కుటుంబ సభ్యులు. అయితే అప్పుడు ఏం జరిగింది.. తాము అనుకున్నట్లే చేశారా.. అన్నది పూర్తి మూవీ.
అయితే చిన్న పాయింట్ తో మూవీని డైరెక్టర్ బాగా డీల్ చేశారని చెప్పాలి. మేకింగ్ అండ్ టేకింగ్ తో అలరించారు. ఫ్యామిలీతో కలిసి చూడడం కాస్త ఇబ్బంది అనుకున్నా.. కాన్సెప్ట్ మాత్రం కొత్తది. తండ్రి చావుతో వచ్చిన సమస్యకు ఏం చేయాలని కొడుకులు చెప్పినప్పుడు ఫుల్ నవ్వులే నవ్వులు. క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.
ఇక క్యాస్టింగ్ విషయానికొస్తే.. సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి కుమారులు వైభవ్, సునీల్ రెడ్డి.. సినిమాలో అన్నదమ్ముల్లా నటించి మెప్పించారు. తమ యాక్టింగ్ తో ఫుల్ గా నవ్వించారని నెటిజన్లు చెబుతున్నారు. వీటీవీ గణేషన్ ఎప్పటిలానే నవ్వించారని అంటున్నారు. కామెడీ, క్లైమాక్స్ మూవీకి మెయిన్ అసెట్స్ అని కామెంట్లు పెడుతున్నారు.
ముఖ్యంగా పెరుసు మూవీ నవ్వులు ఫుల్ గా పూయిస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. స్టార్టింగ్ లో మూవీ పెదరాయుడిలా అనిపిస్తుందని.. కానీ ఆ తర్వాత అభిప్రాయం మారిపోతుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా మంచి కామెడీ ఫిల్మ్ అని చెబుతున్నారు. ఫ్యామిలీతో చూడడం ఇబ్బంది అయినా.. అభ్యంతరకర సీన్స్ లేవ్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు నెట్ ఫ్లిక్స్ లో పెరుసు మూవీని చూశారా?