Begin typing your search above and press return to search.

వారికి చుక్క‌లు చూపిస్తున్న డిజిట‌ల్‌ ప్లాట్‌ఫామ్స్!

కేవ‌లం స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు నిర్మించిన సిరీస్‌లు, సినిమాల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త‌నిస్తూ కొత్త మేక‌ర్స్‌ని ప‌క్క‌న పెడుతుండ‌టంతో చాలా వ‌ర‌కు మేక‌ర్స్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   18 May 2025 5:00 AM IST
వారికి చుక్క‌లు చూపిస్తున్న డిజిట‌ల్‌ ప్లాట్‌ఫామ్స్!
X

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. న‌చ్చిన సినిమాలు, సిరీస్‌లు థియేట‌ర్‌కు వెళ్ల‌కుండా ఇంట్లోనే ఉండి చూసే ఫెసిలీటీ ఉండ‌టంతో చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు ఎడిక్ట్ కావ‌డం మొద‌లైంది. దీంతో సినిమాలు, సిరీస్‌ల‌ని భారీ స్థాయిలో కొన‌డం ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు వాటి ప్ర‌వాహం భారీగా పెర‌గ‌డంతో క్ర‌మ క్ర‌మంగా సినిమాలు, సిరీస్‌ల‌ని కొన‌డం త‌గ్గించి మేక‌ర్స్‌కు షాక్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టాయి.

కేవ‌లం స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు నిర్మించిన సిరీస్‌లు, సినిమాల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త‌నిస్తూ కొత్త మేక‌ర్స్‌ని ప‌క్క‌న పెడుతుండ‌టంతో చాలా వ‌ర‌కు మేక‌ర్స్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అంత‌కు ముందు డిజిట‌ల్ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని అందించి చాలా వ‌ర‌కు నిర్మాత‌ల‌కు లాభాల్ని అందించి సిరీస్‌లు, ఓటీటీ మూవీస్‌కు ఊతం ఇచ్చిన ఓటీటీలు ఇప్పుడు కేవ‌లం సెల‌క్టీవ్‌గా సినిమాలు, సిరీస్‌ల‌ని మాత్ర‌మే కొంటూ మిగ‌తావారికి చుక్క‌లు చూపిస్తున్నాయి.

త‌క్కువ బ‌డ్జెట్‌లో ఓ మోస్తారు పేరున్న న‌టీన‌టుల‌తో నిర్మించిన వాటికి పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం లేదు. దీంతో చిన్న సినిమాలు, సిరీస్‌లు నిర్మిస్తున్న మేక‌ర్స్ ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. అంతే కాకుండా ఈ మ‌ధ్య డిజిట‌ల్ ప్లాట్ పామ్స్ కొత్త ప‌ద్ద‌తిని కూడా అనుస‌రిస్తున్నాయి. చాలా మంది సినిమాలు తీసివాటిని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసుకునే వీలు, డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నారు. అలా తీసుకొచ్చిన సినిమాల‌ని పే ప‌ర్ వ్యూ ప‌ద్ద‌తిలో తీసుకుంటూ కొత్త త‌ర‌హాలో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ప‌లువురు మేక‌ర్స్ వాపోతున్నారు.

చిన్న బ‌డ్జెట్ సినిమాల నిర్మాత‌ల‌కు త‌మ చిత్రాల‌ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డానికి స‌రిప‌డా డ‌బ్బులు ఉండ‌టం లేదు. అంతే కాకుండా ప‌బ్లిసిటీకి బ‌డ్జెట్ కేటాయించ‌లేక‌పోతున్నారు. దీంతో ఓటీటీలు కూడా ఈ సినిమాల‌ని తీసుకోవ‌డానికి ముందుకు రావ‌డం లేదు. దీంతో దాదాపు 300 సినిమాలు ప్ర‌స్తుతం రిలీజ్‌కు నోచుకోక పీక‌ల్లోతు కష్టాల్ని ఎదుర్కొంటున్నాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. శాటిలైట్ మార్కెట్ కూడా వీరికి డోర్లు క్లోజ్ చేయ‌డంతో చిన్న సినిమాలు నిర్మించిన నిర్మాత‌లంతా ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఇది ఇప్పుడు టాలీవుడ్‌లో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.