తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువగా నెట్‌ఫ్లిక్స్
ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలను, ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తూ ఇండియాలో అతి కొద్ది మందికి మాత్రమే నెట్‌ఫ్లిక్స్ చేరువగా ఉండేది.
By: Tupaki Desk | 3 May 2025 9:22 PM ISTఒకప్పుడు హాలీవుడ్ సినిమాలను, ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తూ ఇండియాలో అతి కొద్ది మందికి మాత్రమే నెట్‌ఫ్లిక్స్ చేరువగా ఉండేది. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఇండియాలో ఎంతగా పాపులారిటీని సొంతం చేసుకుందో తెల్సిందే. హిందీ సినిమాలు, సిరీస్‌లను మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనూ తనదైన ముద్రను వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ ఓటీటీ మరో అడుగు ముందుకు వస్తుంది. సౌత్ ఆడియన్స్‌కి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడం కోసం ఈ ఓటీటీ హైదరాబాద్‌లో తన స్టూడియోను ఏర్పాటు చేసేందుకు గాను సిద్ధం అవుతున్నట్లు ఓటీటీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ తన ఒరిజినల్ కంటెంట్‌ను సౌత్ ఇండియన్ భాషల్లోనూ రెడీ చేయించేందుకు గాను సిద్ధం అవుతోంది. ఎక్కువగా సినిమాలను నిర్మాతల నుంచి తీసుకుంటూ ఉండే నెట్‌ఫ్లిక్స్ తమ సొంత కంటెంట్ ను నిర్మించేందుకు ప్రణాళిక ను సిద్ధం చేసుకుంటుంది. ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ స్కాన్‌లైన్ తో కలిసి హైదరాబాద్ లో భారీ స్టూడియోను ఏర్పాటు చేయడం కోసం సిద్ధం అయింది. ఈ స్టూడియోలో హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు మొదలుకుని సౌత్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల వరకు వర్క్ చేసే విధంగా అతి పెద్ద స్టూడియోను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్‌లోని ఇమేజ్ టవర్స్‌లో ఈ వీఎఫ్ఎక్స్ స్టూడియోను నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటు చేసేందుకు గాను సిద్ధం అవుతోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారని తెలుస్తోంది. సినిమా మేకింగ్‌కి హైదరాబాద్ స్వర్గ సీమ అంటారు. అందుకే ఇక్కడ మేకింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి సంబంధించిన స్టూడియోలు ఎక్కువగా ఉంటే మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఇక్కడే పూర్తి చేసే అవకాశాలు ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఈ మధ్య కాలంలో వీఎఫ్‌ఎక్స్ అనేది అత్యంత కీలకమైన విషయం. బడ్జెట్‌లో మేజర్ పార్ట్‌ను సినిమాలోని వీఎఫ్ఎక్స్ కోసం ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో వెబ్ సిరీస్‌ల కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడం విశేషం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్‌లో మరింతగా అభివృద్ది చేసేందుకు గాను కల్పిస్తున్న వసతుల్లో భాగంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి త్వరలోనే తెలుగు ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెజాన్ తరహాలో ప్రముఖ హీరోలతో చర్చలు సైతం జరుపుతోంది.
