జీ5లోకి నవాజుద్దీన్ సిద్ధిఖీ పీరియాడిక్ ఫిల్మ్!
బాలీవుడ్‌లో విభిన్నమైన క్యారెక్టర్లతో వెర్సటైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తెలుగులోనూ నటించిన నవాజుద్దీన్ ఇక్కడ సక్సెస్ కాలేకపోయాడు.
By: Tupaki Desk | 1 May 2025 9:00 PM ISTబాలీవుడ్‌లో విభిన్నమైన క్యారెక్టర్లతో వెర్సటైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తెలుగులోనూ నటించిన నవాజుద్దీన్ ఇక్కడ సక్సెస్ కాలేకపోయాడు. ఆయన నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా `కోస్టావో`. సెజల్ షా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రియా బాపట్, కన్నడ నటుడు కిషోర్, మహికా శర్మ కీలక పాత్రల్లో నటించారు. 90వ దశకం నేపథ్యంలో గోవాలో సాగే క్రైమ్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. కథే హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ గురువారం నుంచి నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ కస్టావో ఫెర్నాండెజ్ అనే కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో నటించారు. సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత్రకు సంబంధించిన కీలక విషయాల్ని వెల్లడించారు. సినిమాలో తన పాత్ర అందరిని నవ్విస్తుందన్నారు. `కోస్టావో అందరిని నవ్విస్తాడు. కానీ తన నవ్వు వెనక దాగివున్న ఒక విషయం కోసం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాడు.
ఆ కాన్సెప్ట్ నచ్చడంతో దీనికి అంగీకరించా. సినిమాలో నా పాత్ర చాలా ధ:ర‌్యంగా ఉంటుంది. నిజాయితీగా ఉంటుంది. నిజాయితీగల కస్టమ్స్ ఆఫీసర్ ఎదుర్కొన్న బాధలు నన్ను ఎంతగానో కదిలించాయి. ఆ పాత్రలో నటించడానికి ముందు భయపడ్డాను.ఒక సన్నివేశాన్ని రూపొందించడానికి చిత్ర బృందం 1000 మార్గాలు కనుగొంది. అది నాకు ఎంతో ఆసక్తిగా అనిపించింది. అందుకే ఈ చిత్రానికి వెంటనే ఓకే చెప్పాను`అని వివరించారు.
1990లో గోవా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన కస్టమ్స్ అధికారి కోస్టావో ఫెర్నాండెజ్ కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. వృత్తిపరంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లతో పాటు వ్యక్తిగతంగా ఆయన ఫేస్ చేసిన కొన్ని విషయాలని ఇందులో చర్చించారు.
