అమెజాన్ ప్రైమ్‌లో యాడ్స్ ఆగవు.. ఇంకా పెరుగుతాయి!
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తమ కంటెంట్ మధ్య యాడ్స్‌ను ప్లే చేస్తున్నారు. ప్రైమ్ యూజర్లు యాడ్స్‌ను చూడాల్సి వస్తుంది.
By: Tupaki Desk | 17 July 2025 3:19 PM ISTఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు కొత్త సినిమాను కొనుగోలు చేసేందుకు ఓటీటీలు లక్షల్లో ఖర్చు చేసేవి. కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను, స్టార్ హీరోలతో సిరీస్‌లను ప్రేక్షకులకు అందించేందుకు గాను వందల కోట్ల రూపాయలను వ్యచ్ఛించాల్సి వస్తుంది. కంటెంట్ రేటు పెరుగుతున్నా కొద్ది ఓటీటీలు వారి సబ్‌స్క్రిప్షన్ రేటు పెంచుతూ వస్తున్నారు. ఓటీటీల మధ్య ఉన్న పోటీ కారణంగా కంటెంట్ క్వాలిటీ పెరిగింది, అంతే కాకుండా నిర్మాతలకు ఓటీటీల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో అమెజాన్ ప్రైమ్ టాప్ ఓటీటీగా నిలిచింది.
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తమ కంటెంట్ మధ్య యాడ్స్‌ను ప్లే చేస్తున్నారు. ప్రైమ్ యూజర్లు యాడ్స్‌ను చూడాల్సి వస్తుంది. ఆ యాడ్స్‌ను తొలగించాలంటే మరింత మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ప్రైమ్ వీడియో వారు చెబుతున్నారు. ఈ విషయమై ప్రైమ్ యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడ్ ఫ్రీ కంటెంట్ ఇచ్చేందుకు తమ వద్ద అమౌంట్‌ను తీసుకున్నారు. ఇప్పుడు మధ్యలో మీరు యాడ్స్‌ను ప్లే చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఓటీటీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయమై చాలా పెద్ద చర్చ జరిగింది. అమెజాన్ తమ యాడ్స్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్ చేశారు.
అమెరికాలోని కొందరు అమెజాన్ సబ్‌స్క్రైబర్స్ ఏకంగా కోర్ట్‌ను ఆశ్రయించారు. తమ వద్ద డబ్బు తీసుకున్న అమెజాన్ ఇప్పుడు యాడ్స్‌ను ప్లే చేయడం ద్వారా మమ్ములను చీటింగ్ చేసిందంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పై విచారణ చేసిన అమెరికన్ కోర్ట్ కీలక తీర్పున ఇచ్చింది. అమెజాన్ వారి కంపెనీ పాలసీకి అనుగుణంగానే యాడ్స్‌ను ప్లే చేస్తుందని, అందుకు సబ్‌స్క్రైబర్స్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలంటే కూడా వారు ఆఫర్ చేస్తున్నారు కనుక వారిని యాడ్స్ తొలగించాల్సిందిగా ఆదేశించలేమని కోర్ట్ పేర్కొంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోకు చాలా పెద్ద ఊరట లభించినట్లు అయింది అని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు.
ఇండియాలో అమెజాన్ యాడ్స్ ప్లే గురించి చర్చ జరిగింది, కానీ అది కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం అయింది. కోర్ట్ వరకు వెళ్లలేదు. ఇండియన్ కోర్ట్ ముందు వెళ్తే ఎలాంటి తీర్పు వచ్చి ఉండేది అనేది ఇప్పుడు కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో యాడ్స్ ప్లే గురించి కోర్ట్ కు వెళ్లే ఆసక్తి ఏ ఒక్కరూ కనబర్చుతున్నట్లుగా లేరు. కనుక అమెరికాతో పాటు, ఇండియా, ఇతర దేశాల్లోనూ ముందు ముందు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో యాడ్స్ కంటిన్యూ చేయబోతుంది. ముందు ముందు ఈ యాడ్స్ డోస్‌ను మరింత పెంచడంతో పాటు, యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం భారీ మొత్తంలో రేటును పెట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
