15 ఏళ్ల తమన్ పాత పాట ఇప్పుడు వైరల్.. కారణం ఇదే!
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏది... ఎప్పుడు.. ఎందుకు.. ఎలా వైరల్ అవుతుందో చెప్పడం కష్టం.
By: Tupaki Desk | 3 Jun 2025 10:00 PM ISTఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏది... ఎప్పుడు.. ఎందుకు.. ఎలా వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. పాటలు, సన్నివేశాలు మాత్రమే కాకుండా వ్యక్తులు సైతం వైరల్ అవుతున్నారు. కేవలం సోషల్ మీడియా కారణంగా ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. సింగర్స్, డాన్సర్స్ ఇలా ఎంతో మంది వింత వింత పనులు చేస్తూ కూడా వైరల్ అవుతూ ఉంటారు. కొందరు ఎంతగా వైరల్ కావాలని కోరుకున్నా, ప్రయత్నాలు చేసినా వైరల్ కాలేరు. కొన్ని పాటలను చాలా కష్టపడి ట్యూన్ చేస్తారు, దర్శకుడు ఎంతో కష్టపడి తీస్తారు. కానీ ఆ పాట జనాలను ఆకట్టుకోదు. కానీ కొన్ని పాటలు చాలా ఈజీగా వైరల్ అయ్యి వందల మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంటాయి.
కొన్ని సార్లు పాత పాటలు, పాత సీన్స్, పాత వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ ఉన్నాం. 2011లో వచ్చిన మంబత్తియన్ అనే సినిమాలోని మలైయూరు నట్టమై అనే పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అప్పట్లో ఈ పాటకు తమన్ సంగీతాన్ని అందించాడు. దాదాపుగా 15 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా, ఆ పాట పెద్దగా అప్పుడు జనాలకు ఎక్కలేదు. తమన్ కెరీర్ ఆరంభంలో చేసిన ఆ పాటను ఆ తర్వాత జనాలు మరచి పోయారు. తమన్ కూడా మరచి పోయి ఉంటాడు. ఆ సినిమా గురించి, ఆ పాట గురించి మళ్లీ ఇప్పుడు ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇటీవల వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో వాడటం వల్లే ఈ పాట వార్తల్లో నిలిచింది.
శశి కుమార్, సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు వచ్చిన ఆధరణ నేపథ్యంలో చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తి కనబర్చారు. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులు సైతం టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను ఓటీటీ ద్వారా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన వెంటనే మంబత్తియన్ సినిమాలోని మలైయూరు నట్టమై పాట తెగ వైరల్ అవుతోంది. సినిమాలో కీలకమైన సన్నివేశంలో శశి కుమార్ అతడి కుమారులు ఈ పాటకు డాన్స్ చేస్తారు.
సినిమా స్క్రీన్ ప్లే చాలా సీరియస్‌గా నడుస్తున్న సమయంలో ఈ పాట వస్తుంది, ఈ పాటకు పిల్లాడు వేసే స్టెప్స్ తో ఒక్కసారిగా మొత్తం మారుతుంది. శశి కుమార్ కూడా ఆశ్చర్యకరంగా లేచి డాన్స్ చేయడంతో అంతా కూడా పాటను తెగ ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం ఈ డాన్స్ బిట్ వరకు చాలా మంది కట్ చేసి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టా, ఎక్స్ లో షేర్ చేస్తూ తమ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో సర్క్యులేట్ అవుతున్న తీరుకు అంతా షాక్ అవుతున్నారు. ఈ పాట కూడా తెగ వైరల్ కావడంతో ఏ సినిమా... ఎవరు హీరో.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటూ చాలా మంది ఈ పాట గురించి ఎంక్వౌరీ చేస్తున్నారు.
