42 ఏళ్ల వయసులో ప్రేమలో పడితే...!
మాధవన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ఆప్ జైసా కోయి' సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది.
By: Tupaki Desk | 28 Jun 2025 7:00 PM ISTమాధవన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ఆప్ జైసా కోయి' సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. హిందీలో రూపొందిన ఈ సినిమాను నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. విభిన్నమైన ఈ ప్రేమ కథ మూవీని వివేక్ సోని రూపొందించారు. కట్టుబాట్ల మధ్య పెరిగిన ఒక వ్యక్తి జీవితం చుట్టూ సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు. 42 ఏళ్ల వ్యక్తి మొదటి సారి ప్రేమలో పడితే, ఆ సమయంలో అతడు టీనేజ్ కుర్రాడిగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఈ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అతడి చుట్టూ ఉండే వారు అతడిని గురించి ఏలా ఆలోచిస్తారు అనే కథాంశంతో ఈ సినిమాను వివేక్ సోనీ తెరకెక్కించాడు.
ఈ సినిమాలో మాధవన్‌కి జోడీగా దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ హీరోయిన్‌గా నటించింది. ఇద్దరి కాంబో సీన్స్ చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నాయి. శృతి మించని శృంగారం, హద్దులు దాటని డైలాగ్స్‌తో సినిమా నీట్‌గా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. మాధవన్ అయిదు పదుల వయసు దాటి చాలా కాలం అయింది. అయినా కూడా ఆయన నుంచి మూడు పదుల వయసు పాత్రలు ఇన్నాళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన నాలుగు పదుల వయసు దాటిన వ్యక్తి పాత్రలో నటించాడు. అది కూడా లవ్ స్టోరీ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన వెంటనే ఈ సినిమా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. సినిమా కథ గురించి చర్చ జరుగుతోంది.
శ్రీ రేణు త్రిపాఠి పాత్రలో మాధవన్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. వయసు మీద పడ్డా కూడా ప్రేమలో పడని వ్యక్తిగా మాధవన్ ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయసులో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఎలాంటి భావోద్వేగాలను కలిగి ఉంటాడు అనేది మాధవన్ చక్కగా నటించి చూపించాడు. ఎప్పటిలాగే తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. మూడు పదుల వయసులో ఉన్న ఫాతిమా సనా షేక్ తన వయసుకు తగ్గ పాత్రలో నటించడం ద్వారా మరోసారి అలరించింది. ఎప్పుడూ గ్లామర్ డాల్ రోల్స్ కాకుండా మంచి పాత్రల్లో నటిస్తూ, తన నటన ప్రతిభ చూపిస్తున్న ఫాతిమా సనా షేక్ కు మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించే అవకాశం దక్కింది.
మధు బోస్ పాత్రలో ఫాతిమ నటన ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ను చక్కగా చూపించారు. అంతే కాకుండా డీసెంట్ కామెడీ సైతం ఈ సినిమాలో ఆకట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా త్వరలో అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. మాధవన్ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మొదట తమిళ ప్రేక్షకులకు ఈ సినిమాను అందించేందుకు గాను నెట్‌ఫ్లిక్స్ రెడీ అవుతుందని సమాచారం అందుతోంది. మాధవన్ ఈ సినిమాలో 42 ఏళ్ల వ్యక్తిగా అద్భుతంగా నటించాడంటూ రివ్యూలు వచ్చాయి.