లాడెన్ డాక్యు సిరీస్ ఇన్‌స్టంట్ హిట్ కారణం?
అయితే ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు అమెరికాను ముప్పు తిప్పలు పెట్టిన ఉగ్రవాది లాడెన్ భారతీయులకు హీరోగానే కనిపించాడు.
By: Tupaki Desk | 20 May 2025 11:02 AM ISTఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్నది భారతీయుల నినాదం. దీనిని ప్రతిబింబిస్తూ, ఇటీవల ఆపరేషన్ సిందూర్ ని చేపట్టి దాదాపు 100 మంది కఠోరమైన పాకిస్తానీ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది భారతీయ సైన్యం. ఉగ్రవాదులకు ఉగ్రవాద దేశాలకు తాము వ్యతిరేకం అని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా కూడా ఆపరేషన్ సిందూర్ దెబ్బకు గడగడలాడింది. అమెరికా ఇంతకుముందు ఒసామా బిన్ లాడెన్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదిని వెంటాడి వేటాడి చంపిన సంగతి తెలిసిందే. తమ దేశ విమానాశ్రయాల్లో ముస్లిములను ప్రత్యేకంగా స్క్రుటినీ చేసే అమెరికా, ఇప్పుడు ముష్కర ఉగ్ర దేశం పాకిస్తాన్ కి అండగా నిలుస్తూ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. దీనిపై భారత్ లోలోన మరుగుతోంది.
సరిగ్గా ఇలాంటి సమయంలో, ఇండియా- పాక్ వార్ జరుగుతున్న సమయంలో ఒసామా బిన్ లాడెన్ వేట ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ `అమెరికన్ మ్యాన్‌హంట్: ఒసామా బిన్ లాడెన్` నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సిరీస్ ఇండియాలో ఇన్ స్టంట్ హిట్ అయింది. ఓవైపు వార్ జరుగుతుండగా, లాడెన్ సిరీస్ ని చూసేందుకు భారతీయులు అమితాసక్తిని కనబరిచారు.
అయితే ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు అమెరికాను ముప్పు తిప్పలు పెట్టిన ఉగ్రవాది లాడెన్ భారతీయులకు హీరోగానే కనిపించాడు. ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కి మద్ధతునిస్తున్న అమెరికా కచ్ఛితంగా విలన్ లాగే కనిపిస్తోంది. అమెరికాలోని భారతీయుల్ని పదే పదే హింసిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ కూడా మరో ఉగ్రవాదిలాగే కనిపిస్తున్నాడు. అందువల్ల కూడా లాడెన్ హీరో అయ్యాడు. అతడు 9/11 దాడులతో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కుప్పకూల్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే ఇలాంటి ఉగ్రదాడులను ఎప్పుడూ వ్యతిరేకించే భారత్ సైతం ఇప్పుడు అమెరికా చర్యలను హర్షించలేని పరిస్థితి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ కంటే కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ వల్ల భారతదేశానికి కలిగే నష్టం ఉగ్రదాడిని మించినది అని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలో అమెరికా దూకుడుకు ముకుతాడు వేసేందుకు తిరిగి ఇండియా సరైన ప్రణాళికతో ముందుకు రావాల్సి ఉంటుంది. ఇండియా- పాక్ యుద్ధం సమయంలో లాడెన్ డాక్యు సిరీస్ ని రిలీజ్ చేయడంలో నెట్ ఫ్లిక్స్ టైమింగుని కొనియాడకుండా ఉండలేం. ఈ సిరీస్ పుణ్యమా అని భారతదేశంతో అమెరికా స్నేహం ఎలాంటిదో కూడా బయటపడింది. ఇప్పుడు భారత్ విశ్లేషించుకునే పనిలో పడింది.