ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!
సెప్టెంబరులో విడుదలైన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘హ్యాపీ జర్నీ’ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఐఎండీబీలో 9.7/10, బుక్ మై షోలో 9.5/10 రేటింగ్స్ సాధించింది. కుటుంబమంతా కలిసి చూడదగిన సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
By: Tupaki Desk | 19 Nov 2026 9:17 AM ISTగత సెప్టెంబరులో వెండితెరపై సందడి చేసిన ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్ ‘హ్యాపీ జర్నీ’, ఇప్పుడు డిజిటల్ వేదికపైనా తన హవాను కొనసాగిస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం, అనతికాలంలోనే ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకుంది. 'కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి' అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌తో తెరకెక్కిన ఈ మూవీ, ఓటీటీ వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. కేవలం వ్యూస్ పరంగానే కాకుండా, ప్రేక్షకుల ఆదరణలోనూ ఈ సినిమా రికార్డు స్థాయి రేటింగ్స్‌ను సొంతం చేసుకుంటోంది. అంతర్జాతీయ రేటింగ్ వేదిక ఐఎండీబీ (IMDb)లో ఏకంగా 9.7/10 రేటింగ్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే బుక్ మై షోలో సైతం 9.5/10 రేటింగ్‌తో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.
గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థల సంయుక్త నిర్మాణంలో బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి, అభిరామ్ నాయుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో ఒదిగిపోయి సినిమాకు ప్రాణం పోశారు.
నటీనటుల అభినయంతో పాటు సాంకేతిక బృందం పనితీరు ఈ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం, మణికందన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం కథకు తగ్గట్టుగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అనుభవజ్ఞులైన చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి కళా దర్శకత్వం సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఎలాంటి అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలిసి హాయిగా చూసే ఒక చక్కని అనుభూతిని ఈ చిత్రం పంచుతోంది.
