Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 'మెగావర్స్'లో తమిళ్ మెగా బ్రదర్..!

చిరంజీవి హోస్ట్‌గా చేస్తున్న ‘మెగావర్స్’ టాక్ షోలో హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగార్జున, బ్రహ్మానందం, సత్యలతో ఎపిసోడ్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మొదటి సీజన్‌ను 14-16 ఎపిసోడ్స్‌తో రూపొందిస్తున్నారట. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ షో సంక్రాంతి సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్.

By:  Ramesh Palla   |   17 Nov 2026 11:08 AM IST
మెగాస్టార్ మెగావర్స్లో తమిళ్ మెగా బ్రదర్..!
X

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మెగా టాక్ షో మొదలైంది. బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోతో ఆకట్టుకున్న తర్వాత ఇక చిరంజీవి రావాల్సి ఉందని మెగా ఫ్యాన్స్‌ గత రెండు మూడు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా మెగాస్టార్‌ చిరంజీవి 'మెగావర్స్‌' అనే టాక్‌ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం మెగావర్స్‌ సీజన్‌ 1 కి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే నాగార్జున గెస్ట్‌గా ఒక ఎపిసోడ్‌ చిత్రీకరణ జరిగింది. అంతే కాకుండా కమెడియన్స్‌ బ్రహ్మానందం, సత్యలతో ఒక ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్‌, సందీప్ రెడ్డి వంగలతో చిరంజీవి 'మెగావర్స్‌' ఎపిసోడ్‌ చిత్రీకరణ జరగబోతుందనే వార్తలు ఇటీవల వచ్చాయి. ఇప్పుడు మరో సూపర్‌ సెలబ్రిటీతో మెగావర్స్ ఒక ఎపిసోడ్‌ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి టాక్‌ షో మెగావర్స్‌లో...

టాలీవుడ్‌ మెగా బ్రదర్స్‌ చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌ అయితే కోలీవుడ్‌ మెగా బ్రదర్స్‌గా సూర్య, కార్తీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. మెగా బ్రదర్‌ సూర్య అంటూ అభిమానులతో పాటు, తమిళ మీడియా వర్గాల వారు కూడా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. సూర్య ఈ ఏడాది ఏకంగా మూడు సూపర్‌ హిట్స్‌తో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాడు. ఇటీవల సీన్‌ సినిమాతో వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు జ్యోతిక నిర్మాతగా వ్యవహరించడంతో సీన్‌ విజయం సూర్యకు మరింత స్పెషల్‌గా మారింది. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఏకంగా మూడు సినిమాలతో రావడం, ఆ మూడు సినిమాలు సూపర్‌ హిట్‌ కావడం, అంతే కాకుండా మూడు సినిమాలు కూడా మొదటి వారంలో రూ.100 కోట్లు అంతకు మించి వసూళ్లు చేయడం రేర్‌ రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. వరుస విజయాలతో ఫుల్‌ హ్యాపీ మూడ్‌ లో ఉన్న సూర్యను మెగావర్స్‌ టాక్‌ షో కు ఆహ్వానించడం, ఆయన వెంటనే ఓకే చెప్పడం జరిగిందట.

టాక్‌ షో లో సూర్యతో కలిసి జ్యోతిక

చిరంజీవితో సూర్య మెగా వర్స్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. సినీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సూర్య తో పాటు ఆయన భార్య జ్యోతిక సైతం ఈ టాక్‌ షో లో పాల్గొంటుందని తెలుస్తోంది. గతంలో చిరంజీవికి జోడీగా జ్యోతిక నటించిన విషయం తెల్సిందే. అందుకే వీరిద్దరి కలయిక ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించబోతుంది. జ్యోతిక కెరీర్‌ పీక్స్ లో ఉన్న సమయంలోనే సూర్యను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయింది. మళ్లీ కుటుంబ బాధ్యతలు తగ్గడం, పిల్లలు పెద్ద వారు కావడంతో జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చి, సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విషయం తెల్సిందే. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జ్యోతిక సూపర్‌ సక్సెస్ అయింది. కనుక సూర్య, జ్యోతికలతో మెగావర్స్‌ ఎపిసోడ్‌ కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుంది అనే నమ్మకంను మెగా ఫ్యాన్స్‌ తో పాటు తెలుగు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.

చిరంజీవి టాక్‌ షో ఎప్పుడు...

మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా ఇప్పటికే కొన్ని షో లు వచ్చాయి. ముఖ్యంగా మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా చిరంజీవి సందడి చేసిన విషయం తెల్సిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ షో ను ఎక్కువ కాలం చిరంజీవి చేయలేక పోయారు. సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టిన చిరంజీవి ఇప్పుడు తన కూతురు బ్యానర్ అయిన గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ టాక్‌ షో ను చేస్తున్నారు. చిరంజీవితో ఉన్న అనుబంధం కారణంగా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్‌ సైతం ఈ టాక్‌ షో లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

ఈ సీజన్‌ మొత్తం తెలుగు స్టార్స్‌తో ఉంటుందని నిన్న మొన్నటి వరకు అంతా భావించారు. కానీ సూర్య, జ్యోతిక ను తీసుకు రావడం వల్ల ఇతర భాషల స్టార్స్ సైతం ఈ మెగా టాక్‌ షోలో పాల్గొనబోతున్నట్లు వెళ్లడి అయింది. ముందు ముందు మరెంత మంది స్టార్స్‌ ఈ టాక్‌ షో లో పాల్గొంటారు అనేది చూడాలి. మెగావర్స్‌ మొదటి సీజన్‌ ను 14 లేదా 16 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్‌ చేయాలని భావిస్తున్నారు. అతి త్వరలోనే మెగావర్స్‌ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రాబోతున్న సినిమాల ప్రమోషన్‌ మెగావర్స్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక సంక్రాంతి వరకు మెగావర్స్‌ స్ట్రీమింగ్‌ కావచ్చని ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.