మళ్లీ వార్తల్లో నిలిచిన రూ.1900 కోట్ల రొమాంటిక్ మూవీ
2023లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ 'ఎనీ వన్ బట్ యు' వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
By: Tupaki Desk | 21 April 2025 3:11 PM IST2023లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ 'ఎనీ వన్ బట్ యు' వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. సాధారణంగా సినిమాలు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం అమెజాన్, జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. రెంటల్ విధానంలో ఈ సినిమాను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం ముగియడంతో అందులో నుంచి సినిమాను తొలగించారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించిన వెంటనే సోనీ లివ్ ద్వారా ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలు పెట్టారు.
ఇన్ని రోజులు రెంటల్ విధానం ద్వారా మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. సోనీ పిక్చర్స్ వారు ఈ సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు సోనీ లివ్‌లో ఉచితంగా స్ట్రీమింగ్‌కు ఉంచారు. విడుదలైన ఏడాదిన్నర తర్వాత సినిమా ఓటీటీలో ఫ్రీగా చూసే అవకాశం దక్కడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఇప్పుడు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆధరణ దక్కించుకుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాలకు ఎప్పుడూ మంచి స్పందన లభిస్తూ ఉంటుంది. ఈ సినిమాకు సైతం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో ఓటీటీలో ఉచితంగా అందుబాటులో ఉంచారు.
అమెజాన్ ప్రైమ్, జీ5 లో ఇప్పటికీ రెంటల్ విధానంలోనే ఈ సినిమా అందుబాటులో ఉంది. కనుక ఈ సినిమాను సోనీ లివ్‌లో ఉచితంగా చూసేందుకు ఇప్పుడు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. అప్పట్లో దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం అయిన తర్వాత రూ.100 కోట్లకు మించి రెంటల్ విధానం ద్వారా దక్కించుకుని ఉంటుందని టాక్. ప్రపంచ వ్యాప్తంగా సోనీ లివ్ ద్వారా ఎనీ వన్ బట్ యు సినిమాను చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఒక సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఏడాదిన్నర తర్వాత ఈ స్థాయిలో స్పందన దక్కించుకోవడం ఇదే ప్రథమం అంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సిడ్నీ స్వీనీ, గ్లెన్ పావెల్ జంటగా నటించిన ఈ సినిమాలో అలెగ్జెండ్రా షిప్ప్, గాటా, హాడ్లీ రాబిన్సన్, మిచెల్ హర్డ్, డెర్మోట్ ముల్రోనీ, డారెన్ బార్నెట్, బ్రయాన్ బ్రౌన్, రాచెల్ గ్రిఫిత్స్‌లు ముఖ్య పాత్రలో నటించారు. విల్ గ్లక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను 2023 డిసెంబర్ 22న ప్రపంచ వ్యక్తంగా విడుదల చేశారు. డేటింగ్‌కు వెళ్లి విడిపోయిన జంట ఒక పెళ్లిలో మళ్లీ కలుస్తారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలు ఏంటి, ఆ సంఘటనల కారణంగా ఇద్దరి నిర్ణయాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అనేది కామెడీతో పాటు, రొమాంటిక్ స్క్రీన్‌ప్లేతో సాగిన ఈ కథ యూత్ ఆడియన్స్‌కి మంచి కిక్ ఇస్తుంది. నిండా రెండు గంటలు లేని ఈ సినిమా వినోదాన్ని కావాల్సినంత అందిస్తుంది.
