చాహల్ 2.0.. ఫామ్.. కెరీర్ స్టాట్స్.. పర్సనల్ లైఫ్.. అన్నిట్లోనూ..
ఇలా అటు క్రికెట్ కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్ లోనూ తీవ్ర సంక్షోభంలో ఉన్న చాహల్ ప్రస్తుత ఐపీఎల్ లో మాత్రం వాటన్నిటినీ వెనక్కునెట్టేలా బౌలింగ్ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 1 May 2025 4:11 PM ISTబక్కపల్చని శరీరంతో.. బంతిని గిరగిరా తిప్పుతూ... వికెట్లు పడగొడుతూ.. 2017 నుంచి మూడునాలుగేళ్లు టీమ్ ఇండియాలో కీలక బౌలర్ గా సేవలందించాడు యుజువేంద్ర చాహల్.. అదే సమయంలో కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మనూ వివాహం చేసుకున్నాడు. అంతా బాగుంటే అది జీవితం ఎందుకవుతుంది..? మొత్తం తలకిందులైంది.
మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో కలిసి వికెట్ల మీద వికెట్లు తీస్తూ టీమ్ ఇండియాలో రెగ్యులర్ సభ్యుడైన చహల్.. అనూహ్యంగా ఫామ్ కోల్పోయాడు.. దీంతో టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. 2016 నుంచి 72 వన్డేలు, 80 టి20లు ఆడిన అతడు ఏడాదిన్నర నుంచి జట్టుకు దూరమయ్యాడు. దాదాపు ఏడాది నుంచి ధనశ్రీ వర్మతోనూ సఖ్యతగా లేడు. చివరకు నెల కిందట వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి.
ఇలా అటు క్రికెట్ కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్ లోనూ తీవ్ర సంక్షోభంలో ఉన్న చాహల్ ప్రస్తుత ఐపీఎల్ లో మాత్రం వాటన్నిటినీ వెనక్కునెట్టేలా బౌలింగ్ చేస్తున్నాడు.
బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ పై హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన చాహల్.. ఈ సీజన్ లో ఇప్పటివరకు 13 వికెట్లు పడగొట్టాడు. దీంతోనే చాహల్ 2.0 మొదలైందని అంటున్నారు.
గతంలో కంటే ఫ్రెష్ గా కనిపిస్తున్న చాహల్.. తాజా ప్రదర్శనతో ఒక ఓవర్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు,
ఐపీఎల్ లో అత్యధికంగా 9 సార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. బుధవారం చెన్నైపైనే కాక.. ఐపీఎల్ లో 2022లోనూ హ్యాట్రిక్ తీశాడు చాహల్. మొత్తానికి ఎక్కువసార్లు హ్యాట్రిక్ తీసిన బౌలర్లలో రెండోస్థానంలో ఉన్నాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్ లో 3 సార్లు హ్యాట్రిక్ తీశాడు. యువరాజ్ సింగ్ రెండుసార్లు హ్యాట్రిక్ నమోదు చేశాడు.
టీమ్ ఇండియలోకి రీ ఎంట్రీ..
34 ఏళ్ల చాహల్ జోష్ చూస్తుంటే అతడు టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీగ్ ముగిసేసరికి ఇదే ఫామ్ ను కొనసాగిస్తే చాహల్ కు సెలక్టర్ల నుంచి పిలుపురావొచ్చు.
