నిన్న 14..నేడు 17..‘ఐపీఎల్’లో అతి చిన్నోళ్లు.. లీగ్ లో ఇదే తొలిసారి
2008 ఏప్రిల్ 18.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కీలక మైలురాయి.. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన రోజు.
By: Tupaki Desk | 21 April 2025 9:07 AM IST2008 ఏప్రిల్ 18.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కీలక మైలురాయి.. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన రోజు. ఈ లెక్కన ఐపీఎల్ 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. 18వ ఏటకు వచ్చింది. కానీ, ఐపీఎల్ కంటే తక్కువ వయసున్న ఇద్దరు కుర్రాళ్లు ఈ సీజన్ లో ఆడుతున్నారు. అంటే వీరు లీగ్ ప్రారంభమయ్యాక పుట్టారు.
వైభవ్ సూర్య వంశీ.. 14 ఏళ్ల 23 రోజుల వయసులో శనివారం రాజస్థాన్ రాయల్స్ తరఫున లక్నో సూపర్ జెయింట్స్ తో ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడాడు. లీగ్ చరిత్రలో ఇప్పటివరకు ఇతడే అతి చిన్న వయసువాడు. వైభవ్ 2011 మార్చి 27న పుట్టాడు. అప్పటికే ఐపీఎల్ నాలుగో సీజన్ నడుస్తోంది.
ఇక ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆయుష్ మాత్రే అరంగేట్రం చేశాడు. 17 ఏళ్ల 278 రోజులు ఇతడి వయసు. ఐపీఎల్ ప్రస్తుత వయసు (17 ఏళ్ల 2 రోజులు) కంటే కాస్త ఎక్కువ అంతే. వాస్తవానికి ఐపీఎల్ సన్నాహకాలు 2007లోనే మొదలయ్యాయి. ఆ లెక్కన ఆయుష్, ఐపీఎల్ ఏజ్ సేమ్ అనుకోవచ్చు.
· ఇక 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలో దిగిన ప్రయాస్ రే బర్మన్ వయసు 16 ఏళ్ల 157 రోజులు. ఇదే ఏడాది రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన రియాన్ పరాగ్ వయసు 17 ఏళ్ల 152 రోజులు.
2018లో పంజాబ్ కింగ్స్ కు ఆడిన ముజీబుర్ రెహ్మన్ వయసు 17 ఏళ్ల 11 రోజులు.
తొలి సీజన్ 2008లో పేసర్ ప్రదీప్ సాంగ్వాన్ 17 ఏళ్ల 179 రోజుల వయసులో అప్పటి ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.
2015లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 17 ఏళ్ల 182 రోజుల వయసులో తొలి మ్యాచ్ ఆడాడు సర్ఫరాజ్ ఖాన్.
2017లో 17 ఏళ్ల 199 రోజుల వయసులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అప్పటి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ (ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్)కు, ఇదే ఏడాది పుణెకు 17 ఏళ్ల 247 రోజుల వయసులో రాహుల్ చాహర్ ప్రాతినిధ్యం వహించాడు.
ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొడుతున్న టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ 2018లో 17 ఏళ్ల 250 రోజుల వయసులో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడాడు. ఇప్పుడు సన్ రైజర్స్ లోనే ఉన్న వికెట కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ 17 ఏళ్ల 262 రోజుల వయసులో 2017లో గుజరాత్ లయన్స్ కు ఆడాడు.
అయితే, వీరిలో చాలామంది తొలి మ్యాచ్ ఆడేటప్పటికి (తొలినాళ్ల సీజన్ లు తప్ప) ఐపీఎల్ కంటే పెద్ద వయసువారే.
వైభవ్ అయితే ఐపీఎల్ కంటే చాలా చిన్నోడు. ఆయుష్ మాత్రే దగ్గరదగ్గర ఐపీఎల్ వయసు ఉన్నావాడు.
