Begin typing your search above and press return to search.

రోహిత్ ను 45 ఏళ్ల వ‌ర‌కు ఆడించాలి.. యోగ్ రాజ్ వింత ప్ర‌తిపాద‌న‌

రోహిత్ ఫిట్ నెస్ పై చాలా అనుమానాలున్నాయి. ఇటీవ‌ల ముంబై ఎయిర్ పోర్టులో అత‌డి ఫొటోను చూస్తేనే బాడీపై పూర్తిగా అదుపుతప్పిన‌ట్లు క‌నిపించాడు.

By:  Tupaki Desk   |   18 Aug 2025 9:07 AM IST
రోహిత్ ను 45 ఏళ్ల వ‌ర‌కు ఆడించాలి.. యోగ్ రాజ్ వింత ప్ర‌తిపాద‌న‌
X

ఇప్ప‌టికే 38 ఏళ్ల వ‌య‌సుకు వ‌చ్చి... టి20ల నుంచి దాదాపు ఏడాదిన్న‌ర కింద‌టే రిటైర‌యి.. ఘోర వైఫ్య‌లంతో టెస్టు నుంచి ప‌క్క‌కు త‌ప్పించాక ఇటీవ‌లే టెస్టు ఫార్మాట్ కూ గుడ్ బై చెప్పాడు స్టార్ బ్యాట్స్ మ‌న్ రోహిత్ శ‌ర్మ‌. ఏడాదికి ఐదారుకు మించి జ‌ర‌గ‌ని వ‌న్డే ఫార్మాట్ లో మాత్ర‌మే అత‌డు కొన‌సాగుతున్నాడు. అస‌లు ఈ ఫార్మాట్ కెప్టెన్ అతడే. అయినా జ‌ట్టులో స్థానం ఖాయ‌మా..? అంటే క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. చివ‌ర‌గా ఫిబ్ర‌వ‌రిలో టీమ్ ఇండియా వ‌న్డేలు ఆడింది. మ‌ళ్లీ అక్టోబ‌రులో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ లు ఆడ‌బోతోంది. ఇలాంటి స‌మ‌యంలో రోహిత్ ను కొన‌సాగించ‌డం అవ‌స‌ర‌మా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

మ‌రో ఏడేళ్లు ఆడించాలంట‌...

రోహిత్ ఫిట్ నెస్ పై చాలా అనుమానాలున్నాయి. ఇటీవ‌ల ముంబై ఎయిర్ పోర్టులో అత‌డి ఫొటోను చూస్తేనే బాడీపై పూర్తిగా అదుపుతప్పిన‌ట్లు క‌నిపించాడు. కానీ, రోహిత్ శ‌ర్మ‌ను 45 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చేవ‌ర‌కు ఆడించాల‌ని బీసీసీఐకి సూచిస్తున్నాడు యోగ్ రాజ్ సింగ్. ఈయ‌న ఎవ‌రో కాదు.. టీమ్ ఇండియా ప్ర‌పంచ క‌ప్ ల హీరో, డాషింగ్ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ తండ్రి. పంజాబ్ లో పెద్ద అకాడ‌మీని న‌డుపుతున్న యోగ్ రాజ్ త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తుంటాడు. మంచి క్రికెట్ నైపుణ్యం ఉన్న అత‌డు త‌న కుమారుడి కెరీర్ ను మాజీ కెప్టెన్ ధోనీ దెబ్బ‌తీశాడ‌ని ఆరోపిస్తుంటాడు. ఇలా ఒక‌టికి రెండుసార్లు చూసి.. యోగ్ రాజ్ తీరు ఇంతే అని అంద‌రూ వ‌దిలేశారు.

45 ఏళ్ల వ‌ర‌కు ఆడ‌గ‌ల‌డా...?

కోచింగ్ లో ఉన్న యోగ్ రాజ్ త‌న వ్యాఖ్య‌ల ద్వారా ఏం చెప్పాల‌నుకుంటున్నాడో అన్న‌ది చూద్దాం.. రోహిత్ వ‌య‌సు ఇప్ప‌టికే 38. ఫిట్ నెస్ తో పాటు ఫామ్ కూడా దెబ్బ‌తిన్న‌ది. అస‌లు టెస్టు జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న అత‌డిని ఆస్ట్రేలియా టూర్ లో చివ‌రి మ్యాచ్ ఆడించ‌నే లేదు. ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక క‌ష్ట‌మేన‌ని బీసీసీఐ నుంచి సూచ‌న‌లు రావ‌డంతో ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అలాంటివాడిని మ‌రో ఏడేళ్లు ఆడించాల‌ని బీసీసీఐని కోర‌డం అంటే హాస్యాస్ప‌ద‌మే..! పైగా బీసీసీఐనే రోహిత్ మ‌రో ఐదేళ్ల ఆడు అని అడ‌గాల‌ని యోగ్ రాజ్ న‌వ్వు పుట్టించే ప్ర‌తిపాద‌న చేశాడు. అదేమంటే.. రోహిత్ కు అంత సామ‌ర్థ్యం ఉంది అంటాడు.

సామ‌ర్థ్యం స‌రే.. శ‌రీరం స‌హ‌క‌రించాలిగా..?

యోగ్ రాజ్ తీరు చూసి నెటిజ‌న్లు న‌వ్వుకుంటున్నారు. రోహిత్ వంటి క్రికెట‌ర్ విష‌యంలో అత‌డి వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. కానీ, ఎంత అభిమానులైనా నిజాలు మాట్లాడుకుంటారు క‌దా.? రోహిత్ కు సామ‌ర్థ్యం స‌రే.. 45 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు శ‌రీరం స‌హ‌క‌రించాలిగా..? అని ప్ర‌శ్నిస్తున్నారు. వెట‌ర‌న్ స్టార్ల గురించి వెంట‌ప‌డితే యువ‌కుల‌కు అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

అస‌లు గంభీర్ లెక్క‌ల్లో రోహిత్ ఉన్నాడా..?

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ భ‌విష్య‌త్ లెక్క‌ల్లో రోహిత్ శ‌ర్మ లేనేలేడు. ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయ‌డ‌మే గ‌గ‌నం. అలాంటిది ఇంకో ఐదేళ్ల పాటు కొన‌సాగింపా? అనేది చ‌ర్చ‌నీయాంశం. ఈ ఏడాది రోహిత్ ను ఆడించ‌డ‌మే ఎక్కువ అని అంటున్నారు.