Begin typing your search above and press return to search.

ఓ దిగ్గజం రికార్డు సమం.. మరో దిగ్గజం రికార్డు దిశగా పరుగు

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. రాంచీలో నాలుగో టెస్టులో విజయం సాధించింది

By:  Tupaki Desk   |   26 Feb 2024 9:20 AM GMT
ఓ దిగ్గజం రికార్డు సమం.. మరో దిగ్గజం రికార్డు దిశగా పరుగు
X

సరిగ్గా ఆరు నెలల కిందటనే జాతీయ జట్టులోకి వచ్చిన టీమిండియా యువ బ్యాట్స్ మన్ యశస్వి జైశ్వాల్ ఓ గొప్ప రికార్డును అందుకునేందుకు దగ్గరగా ఉన్నాడు. కేవలం 8 టెస్టుల అనుభవం ఉన్న అతడు.. 54 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే దిశగా పరుగు తీస్తున్నాడు. ఈ క్రమంలో ఏడేళ్ల నాటి రికార్డును సమం చేసేశాడు. కాస్త ఓపిక పట్టి ఉంటే ఇప్పటికే అతడి రెండో రికార్డును ఛేదించేవాడే. కానీ, దూకుడుకు పోయి చేజార్చుకున్నాడు.

మరో రెండు ఇన్నింగ్స్ ల చాన్స్

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. రాంచీలో నాలుగో టెస్టులో విజయం సాధించింది. అయితే, ఈ సిరీస్ తొలి టెస్టు హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. రెండో టెస్టు విశాఖపట్టణంలో జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఓ సిరీస్ లో తొలి రెండు టెస్టులు నిర్వహించడం ఇదే ప్రథమం. కాగా, తొలి టెస్టును భారత్ చేజార్చుకుంది. అయితే, యువ ఓపెనర్ జైశ్వాల్ మొదటి ఇన్నింగ్స్ లొ 80, రెండో ఇన్నింగ్స్ లో 15 పరుగులు చేశాడు. ఇక విశాఖపట్టణం టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ (209) బాదేశాడు. ఆపై రాజ్ కోట్ లోనూ డబుల్ డబుల్ సెంచరీ (214) కొట్టాడు. ఇది రెండో ఇన్నింగ్స్ లో చేసిన డబుల్ సెంచరీ కావడం విశేషం. ఇక రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, 73 పరుగుల వద్ద ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 37 పరుగులు కొట్టాడు. మొత్తమ్మీద అతడు ఇఫ్పటివరకు నాలుగు టెస్టుల్లో 655 పరుగులు చేశాడు. స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. 2016-17 సీజన్ లో కోహ్లి ఇంగ్లండ్ పైనే 655 పరుగులు కొట్టాడు.

మొత్తమ్మీద నాలుగో స్థానం

ఇప్పటివరకు ఒక టెస్టు సిరీస్ లో టీమిండియా బ్యాట్స్ మన్ చేసిన అత్యధిక పరుగులు 774. ఇవి లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ 1970-71 సీజన్ లో కేవలం నాలుగు టెస్టుల్లో 8 ఇన్నింగ్స్ ఆడి అరివీర భయంకర వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ మరీ చేసిన పరుగులు. ఆపై ఇదే గావస్కర్ 1978-79 సీజన్ లోనూ మళ్లీ వెస్టిండీస్ పైనే 6 టెస్టుల సిరీస్ (9 ఇన్నింగ్స్)లో 732 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత 2014-15 సీజన్ లో ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లి ఏకంగా 4 టెస్టుల సిరీస్ (8 ఇన్నింగ్స్)లో 692 పరుగులు బాదాడు. ఈ లెక్కన కోహ్లి మూడో స్థానంలో (1, 2 స్థానాలు గావస్కర్ వే అనుకుంటే) ఉన్నాడు. ఇప్పుడు కోహ్లిని దాటేసి.. గావస్కర్ రికార్డును బద్దలుకొట్టేందుకు జైశ్వాల్ దూసుకెళ్తున్నాడు.

ఈ సిరీస్‌ లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఫామ్ ను చూస్తుంటే ఐదో టెస్టులోనూ రాణిస్తాడని చెప్పవచ్చు. మరో వంద కు పైగా పరుగులు చేస్తాడని అంచనా వేయొచ్చు. గావస్కర్ ఆల్ టైమ్ రికార్డు స్కోరు (774)కు జైశ్వాల్ ఇంకా 119 పరుగుల దూరంలో ఉన్నాడు. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టులోనూ జైశ్వాల్ రెండు ఇన్నింగ్స్ ఆడితే గావస్కర్ స్కోరును దాటేయడం పెద్ద కష్టం కాదు. ఈ క్రమంలో కోహ్లి (692)ని దాటేసి మూడో స్థానంలోకి వచ్చేస్తాడు. కాగా, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (602 పరుగులు, 2002లో), కోహ్లి (593 పరుగులు, 2018లో), విజయ్ మంజ్రేకర్ (586 పరుగులు, 1961-62లో) ఓ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ జాబితాలో గావస్కర్, కోహ్లి, జైశ్వాల్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

కొసమెరుపు: గావస్కర్ రికార్డును బద్దలుకొట్టుందు జైశ్వాల్ కు ఇదే మంచి అవకాశం. అయితే, సాక్షాత్తు గావస్కర్ మాటల్లోనే చెప్పాలంటే క్రికెట్ అంటేనే అనిశ్చితి. ఈ రోజు సెంచరీ కొట్టిన బ్యాట్స్ మన్ రేపు డకౌట్ కావొచ్చు. అయితే, జైశ్వాల్ అలాకాకుండా సరికొత్త రికార్డును నెలకొల్పుతాడని ఆశిద్దాం.