ఇందుకే ఆ క్రికెటర్ కు టీమ్ ఇండియా కెప్టెన్సీ దక్కనిది?
ఇంగ్లండ్ పర్యటనకు సన్నాహంగా టీమ్ ఇండియా ఆటగాళ్లు కొందరిని ఇండియా ఏ జట్టు తరఫున ముందుగానే ఇంగ్లండ్ పంపాపరు.
By: Tupaki Desk | 7 Jun 2025 7:39 PM ISTసరిగ్గా రెండు నెలల కిందట టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ గా యువ ఓపెనర్ పేరు గట్టిగా వినిపించింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి అతడికి బాగా మద్దతు ఉందని.. దీంతో అతడే కాబోయే కెప్టెన్ అని కథనాలు కూడా వచ్చాయి. మరోవైపు 20 టెస్టుల అనుభవం కూడా లేని, రెండేళ్ల కిందటే టీమ్ ఇండియాలోకి వచ్చిన అతడికి కెప్టెన్సీ ఇవ్వడం సరైనదేనా? అందులోనూ టెస్టు కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టెనా? అనే అభిప్రాయాలు వినిపించాయి. అసలు అతడి తత్వం ఏమిటి? యాటిట్యూడ్ అలవడిందా? అని పూర్తిగా తెలియకుండానే భారత జట్టు కెప్టెన్సీ అప్పగించడం సరికాదనే సూచనలూ వచ్చాయి. చివరకు ఏం జరిగిందో కానీ.. ఈ క్రికెటర్ కు కెప్టెన్సీ దక్కలేదు. వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇలా చేశారా? అనే ప్రశ్నలు వచ్చాయి. తాజాగా జరిగిన ఘటన చూస్తే.. బహుశా ఇందుకేనేమో? అనిపిస్తోంది.
టీమ్ ఇండియా కెప్టెన్ అంటే మామూలు మాటలు కాదు. 150 కోట్ల ప్రతినిధి. ప్రపంచ క్రికెట్ పెద్దన్న వంటి భారత్ కు అతడొక సింబల్. అందుకే కెప్టెన్సీ అనేది ఆచితూచి ఇస్తారు. కాగా, ఇటీవల కాలంలో టెస్టు కెప్టెన్ గా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పేరు బలంగా వినిపించింది. కానీ, మరో యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కు సారథ్యం దక్కింది. వాస్తవానికి టెస్టుల్లో గిల్ కంటే జైశ్వాల్ మంచి బ్యాట్స్ మన్. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలో రాణించాడు. కానీ, వ్యక్తిగా జైశ్వాల్ మరింత పరిణతి సాధించాల్సినందునే కెప్టెన్సీ ఇవ్వనట్లు తెలుస్తోంది. తాజా ఉదంతం దీనిని బలపరుస్తోంది.
ఇంగ్లండ్ పర్యటనకు సన్నాహంగా టీమ్ ఇండియా ఆటగాళ్లు కొందరిని ఇండియా ఏ జట్టు తరఫున ముందుగానే ఇంగ్లండ్ పంపాపరు. ఇంగ్లండ్ లయన్స్ (ఇంగ్లండ్- ఎ) జట్టుతో అక్కడ రెండు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో జైశ్వాల్ 26 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఎల్బీ ఇచ్చినా.. జైశ్వాల్ క్రీజ్ వదల్లేదు. తాను ఔట్ కాలేదంటూ అంపైర్ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ, అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడడంతో జైశ్వాల్ అన్ హ్యాపీగానే మైదానాన్ని వీడాడు.
ఇంగ్లండ్ లో ఏ స్థాయి క్రికెట్ అయినా మంచి స్టాండర్డ్స్ తో ఉంటుంది. అలాంటి ఎ జట్టు తరఫున ఆడుతూ జైశ్వాల్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే అంతర్జాతీయ మ్యాచ్ అయి ఉంటే? జైశ్వాల్ పై చర్య తీసుకునేవారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఆటగాడిగా రాణిస్తున్నప్పటికీ.. గ్రౌండ్ లో తన చర్యల ద్వారా జైశ్వాల్ కొంత చర్చనీయం అవుతున్నాడు. పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చిన అతడికి మంచి భవిష్యత్ ఉంది. అది సాకారం కావాలంటే కొన్ని విషయాల్లో తగ్గి ఉండాలి.