టీమిండియా క్రికెటర్ కావాల్సినోడు.. యువతి మోసం ఫిర్యాదులో ఇరికాడు?
2023 ఐపీఎల్ సీజన్ లో ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టించుకుని జట్టు ఓటమికి కారణమైన అతడు తర్వాత బలంగా పుంజుకొన్నాడు.
By: Tupaki Desk | 29 Jun 2025 11:30 AM IST2023 ఐపీఎల్ సీజన్ లో ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టించుకుని జట్టు ఓటమికి కారణమైన అతడు తర్వాత బలంగా పుంజుకొన్నాడు. గత రెండు సీజన్ల నుంచి మంచి ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియా రేసులో ఉన్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొట్టడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. కాస్త టైం కలిసి వస్తే ప్రస్తుత ఇంగ్లండ్ టూర్ లో టీమిండియాల కావాల్సిన వాడు.
కానీ, ఇప్పుడు యువతిని మోసం చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ యశ్ దయాల్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. తనను యశ్ మోసం చేశాడంటూ ఏకంగా యూపీ సీఎం యోగికే లేఖ పంపింది.
వివాహం చేసుకుంటానని నమ్మించిన దయాల్.. ఆ తర్వాత మోసం చేశాడంటూ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ కు ఫిర్యాదు చేసింది.
యువతి చెబుతున్నదాని ప్రకారం దయాల్ తో ఆమె ఐదేళ్లుగా రిలేషన్ లో ఉంది. అతడు ఆమెను ఇంట్లోవారికి కూడా పరిచయం చేశాడు. శారీరకంగా, మానసికంగానూ హింసించినట్లు పేర్కొంటోంది. యశ్ దయాల్ కు మరికొందరు యువతులతోనూ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు చేసింది. ఈ నెల 14న మహిళల హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేసినా దయాల్ పై పోలీసులు చర్యలు తీసుకోలేదని.. అందుకే సీఎంకు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. క్రికెటర్ తో దిగిన ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లు, వీడియో కాల్స్ వివరాలను తన ఫిర్యాదులో జోడించింది. యువతి ఫిర్యాదుపై సీఎం యోగి కార్యాలయం ఘజియాబాద్ సర్కిల్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరింది.
