మా జట్టు చాంపియన్ అయిందహో..లార్డ్స్‌లో దక్షిణాఫ్రికా దిగ్గజాల జోష్
ఇక తమ జట్టు గెలుపునకు దగ్గరవుతున్న కొద్దీ డివిలియర్స్ వంటి వారిలో ఉత్కంఠ పెరిగిపోయింది. మార్క్‌రమ్ బ్యాటింగ్‌ను బాగా ఎంజాయ్ చేసిన అతడు.. ఓ చేత్తో సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తూ, మరోచేత్తో పిడికిలి బిగించి విజయనాదం చేశాడు.
By: Tupaki Desk | 14 Jun 2025 7:26 PM ISTఒకరూ ఇద్దరు కాదు.. ఈతరంలో దిగ్గజాలుగా పేరున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు అందరూ తరలివచ్చారు. అదేదో శుభకార్యం ఉన్నట్లు..తామందరినీ పిలిచినట్లు దిగిపోయారు.. ప్రతి ఒక్కరి కళ్లలోనూ ఎన్నడూ లేనంత ఉత్కంఠ...తమ కల సాకారం కావడం ఇంకెప్పుడు చూస్తామా? అని ఉద్వేగం.. తీరా అనుకున్నది జరిగాక పట్టలేని ఆనందం... ఇదీ శనివారం లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో కనిపించిన దృశ్యం..!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో ఎప్పుడూ దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికాకు ఈసారి అదృష్టం కలిసివచ్చింది. 2023-25 సైకిల్‌లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరింది. వాస్తవానికి ఈ సైకిల్ మధ్యలోకి వచ్చేసరికి దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ రేసులో లేదు. టీమ్ ఇండియా టాప్‌లో కొనసాగుతూ ఫైనల్ చేరడం ఖాయం అనేలా ఉంది. కానీ, అనూహ్యంగా చివరి 8 టెస్టుల్లో 6 ఓడిపోయి, ఒకటి మాత్రమే గెలిచి, మరోటి డ్రా కావడంతో టీమ్ ఇండియా ఫైనల్ చేరలేకపోయింది. అయితే, వరుసగా చివరి ఏడు మ‍్యాచ్‌లు గెలిచిన దక్షిణాఫ్రికాకు ఫైనల్ బెర్తు దక్కింది.
ఈ నెల 11 నుంచి మొదలైన ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు శనివారం 281 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. అయితే, శుక్రవారం తమ జట్టు విజయం ఖాయం కావడంతో దక్షిణాఫ్రికా దిగ్గజాలు లార్డ్స్ మైదానానికి తరలివచ్చారు. వీరిలో మాజీ కెప్టెన్లు షాన్ పొలాక్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ తో పాటు దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్‌కు వందకుపైగా ఆడిన స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ తదితరులు ఉన్నారు.
జాతి వివక్ష కారణంగా 21 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైన దక్షిణాఫ్రికా 1990లో తిరిగి వచ్చింది. అప్పటినుంచి బలమైన జట్టుగానే ఉంది. కానీ, ప్రపంచ చాంపియన్ కాలేకపోయింది. టి20ల్లో గత ఏడాది ప్రపంచ కప్ ఫైనల్‌కు వచ్చినా భారత్ చేతిలో ఓడింది. వన్డే ప్రపంచ కప్‌లలో సెమీఫైనల్ గడప దాటలేదు. మహిళల క్రికెట్‌లోనూ ఈ ఘనతను అందుకోలేదు. అందుకే లార్డ్స్‌లో తాజాగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను చూసేందుకు దక్షిణాఫ్రికా దిగ్గజాలు తరలివచ్చారు.
ఇక తమ జట్టు గెలుపునకు దగ్గరవుతున్న కొద్దీ డివిలియర్స్ వంటి వారిలో ఉత్కంఠ పెరిగిపోయింది. మార్క్‌రమ్ బ్యాటింగ్‌ను బాగా ఎంజాయ్ చేసిన అతడు.. ఓ చేత్తో సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తూ, మరోచేత్తో పిడికిలి బిగించి విజయనాదం చేశాడు. గ్రేమ్ స్మిత్ ఈ మ్యాచ్‌కు స్పాన్సరర్స్ అఫీషియల్ హోదాలో హాజరైనట్లు కనిపించింది. మ్యాచ్ ముగిశాక అతడు తమ దేశ ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేశాడు. కాగా, ఫైనల్‌కు దక్షిణాఫ్రికా అభిమానులు కూడా భారీగా హాజరయ్యారు. వీరిలో చిన్న పిల్లలు, యువత, మహిళలు ఉండడం విశేషం. తమ జట్టు గెలుపును కళ్లారా చూసేందుకు వచ్చిన వీరంతా లార్డ్స్ మైదానంలో హల్‌చల్ చేశారు.
మొత్తానికి 27 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. 1998లో ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు గద (డబ్ల్యూటీసీ విజేతకు ఇచ్చేది)అందుకుంది.
