4 రోజుల టెస్టు మ్యాచ్.. అడ్డంకులతో ఆట.. భారత్ కూడా ఒప్పుకోవట్లే..
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్ అత్యంత సంచలన రీతిలో ముగిసింది.
By: Tupaki Desk | 18 Jun 2025 12:00 AM ISTప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్ అత్యంత సంచలన రీతిలో ముగిసింది. గత శనివారం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు విజేతగా నిలవడంతో కొత్త చరిత్ర మొదలైంది. వరుసగా మూడో సైకిల్ లో మూడో జట్టు (న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా) చాంపియన్ అయింది.
ఇక మంగళవారం నుంచి డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ మొదలైంది. శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య గాలెలో టెస్టు మొదలైంది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ –భారత్ మధ్య టెస్టు జరగనుంది.
అయితే, టెస్టులు అంటే ఇప్పటివరకు ఐదు రోజులు మ్యాచ్ లే. కానీ, నాలుగు రోజుల టెస్టులు కూడా ఉన్న సంగతి చాలామందికి తెలియదు. అయితే ఇవి ఎక్కువగా చిన్న జట్లకు ఉద్దేశించినవి. గత నెలలో ఇంగ్లండ్-జింబాబ్వే ఇలానే నాలుగు రోజుల మ్యాచ్ లో తలపడ్డాయి. 2019, 2023లోనూ ఇంగ్లండ్-ఐర్లాండ్ నాలుగు రోజుల మ్యాచ్ లో ఆడాయి.
కాగా, చిన్న జట్లకు నాలుగు రోజుల మ్యాచ్ లు నిర్వహించేందుకు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్ధమైందట. అదికూడా 2027-29 సైకిల్ లోనే. ఐసీసీ చీఫ్ గా జై షా నిర్వహించిన సమావేశంలో వచ్చిన ఈ ప్రతిపాదనలకు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి పెద్ద దేశాలు ఒప్పుకోలేదట. ఒక రోజు తగ్గిస్తే.. ప్రమాణాల పరంగా వెనుకబడి ఉన్న చిన్న దేశాల జట్లకు ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం కూడా లభిస్తుంది. కానీ, జై షా ప్రతిపాదనకు మద్దతు లభించలేదని సమాచారం.
ఇక డబ్బు, సమయం రీత్యా ఐదు రోజుల మ్యాచ్ లకు చిన్న జట్లు ఆసక్తిగా లేవట. నాలుగు రోజుల మ్యాచ్ లైతే 3 వారాల్లోపే మూడు టెస్టుల సిరీస్ ఆడే వీలుంటుంది. రోజుకు 90 ఓవర్ల బదులు 98 వేస్తారు.
ఇక నాలుగు రోజుల మ్యాచ్ లు జరిగితే.. అది 2027-29 సైకిల్ లోనే. ఎందుకంటే 27 సిరీస్ ల ఈ సైకిల్ మంగళవారమే మొదలైపోయింది. 17 సిరీస్ లలో 2 టెస్టులు, 6 సిరీస్ లలో 3 టెస్టులు జరగనున్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లు జరుగుతాయి. ఆశ్చర్యకరంగా నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకించింది ఈ మూడు దేశాలే కావడం గమనార్హం. పెద్ద జట్టుతో చిన్న జట్టు తలపడే మ్యాచ్ లనే నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.
