Begin typing your search above and press return to search.

అసలే కివీస్.. సెమీస్ కు వాన గండం.. ఎదురైతే ఎలా?

భారత క్రికెట్ అభిమానులను అత్యంత వేధించిన క్షణాల్లో ఒకటి.. 2019 సెమీఫైనల్. న్యూజిలాండ్ తో నాడు జరిగిన సెమీస్ లో టీమిండియా మొదట ముందంజలోనే ఉంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 12:30 PM GMT
అసలే కివీస్.. సెమీస్ కు వాన గండం.. ఎదురైతే ఎలా?
X

భారత క్రికెట్ అభిమానులను అత్యంత వేధించిన క్షణాల్లో ఒకటి.. 2019 సెమీఫైనల్. న్యూజిలాండ్ తో నాడు జరిగిన సెమీస్ లో టీమిండియా మొదట ముందంజలోనే ఉంది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది భారత్. అందులోనూ నేటి కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు సెంచరీలతో సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. రాహుల్ కూడా ఫామ్ లోనే కనిపించాడు. నాటి కెప్టెన్ అయిన కోహ్లి సంగతి చెప్పేదేముంది..? అన్నిటికీ మించి గ్రేట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండనే ఉన్నాడు. మెరుపు వీరులు రిషభ్ పంత్, హార్దిక పాండ్యా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వీరందరూ ఉండడంతో గెలుపు మనదే అనిపించింది. కానీ, వర్షం పడడంతో మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది. అప్పటికీ విజయం భారత్ చేజారదు అని భావించారు. కానీ, ఏం జరిగిందో అందరూ చూశారు. వికెట్ల మధ్య అత్యంత చురుగ్గా పరుగెత్తే ధోనీనే రనౌట్ చేసి.. మ్యాచ్ ను వశం చేసుకుంది న్యూజిలాండ్.

నాడు వాన.. మరి నేడు?

2019లో ప్రపంచ కప్ జరిగింది ఇంగ్లండ్ లో. ఇప్పుడు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అప్పట్లో జూలైలో ప్రపంచ కప్ జరిగితే.. ఇప్పుడు నవంబరు వచ్చింది. కాగా, భారత్ లో ఇప్పుడు వర్షాకాలం కానప్పటికీ, వర్షం కురవదని చెప్పలేం. మ్యాచ్ జరిగేది కూడా.. ఆరేబియా సముద్ర తీరంలోని ముంబైలో. కాకపోతే.. పూర్తి స్థాయిలో వాన పడకపోవచ్చు. అంతరాయం తరహాలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే ముఖ్యంగా ఆలోచించాల్సింది డక్ వర్త్ లూయీస్ పద్ధతి గురించి. ఇక వాంఖడే పిచ్ బ్యాటింగ్‌ కు అనుకూలం. బౌండరీ దూరం తక్కువ. అందుకని ఫోర్లు, సిక్సర్లు బాదేయవచ్చు. బౌలింగ్ పరంగా చూస్తే పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. కాబట్టి.. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగే చేస్తుందని చెప్పొచ్చు.

సగటు 261 పైనే..

వాంఖడే పిచ్ అంటే.. మనందరికీ గుర్తొచ్చేది 2011లో ధోని సిక్స్ కొట్టి ప్రపంచ కప్ అందించిన క్షణమే. నాడు ప్రత్యర్థి శ్రీలంక చేసింది కూడా 274 పరుగులే కావడం గమనార్హం. ఇక వాంఖడేలో తొలి ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 261. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే అధిక మ్యాచ్‌ లను గెలిచింది. 14 మ్యాచ్‌ లల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు, 13 సార్లు ఛేదనకు దిగిన జట్లు విజయం అందుకున్నాయి. అంతమాత్రాన వాంఖడే పిచ్.. మరీ మందకొడి ఏమీ కాదు. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2015లో భారత్‌ పై 4 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది ఆ జట్టు.

వాన కురిస్తే.. ఎలా?

బుధవారం ముంబైలో సాధారణ వాతావరణమే ఉండనుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు. గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా ఉంటుందని అంచనా. గంటకు 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తేమ శాతం 44. అన్నిటికీమించి వర్షం పడే అవకాశాలు లేవు. అయినప్పటికీ వాన కురిస్తే.. మ్యాచ్ ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. వాతావరణం లేదా ఏదైనా ఇతర అనివార్య పరిస్థితుల కారణంగా అంతరాయం ఏర్పడినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ రెండు గంటలు దాటినా మ్యాచ్ ఆరంభం కాకపోతే డక్‌ వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరిస్తారు. మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు నిలిచిపోయి.. రాత్రి 8 గంటలకు మళ్లీ మొదలైతే ఓవర్ల కుదింపు ఉండదు. కానీ, 8 గంటలకూ మ్యాచ్ మొదలు కానప్పుడే డక్‌ వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరిస్తారు. ప్రతి అయిదు నిమిషాలకు ఒకటి చొప్పున ఓవర్‌ ను కుదిస్తారు.

కుదింపు ఇలా..

2 గంటల అంతరాయం తర్వాత మరో 20 నిమిషాలు ఆట జరగలేదనుకుంటే.. నాలుగు ఓవర్లు కుదిస్తారు. అంటే.. 46 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. కాగా, రెండు సెమీ ఫైనల్స్‌కు కూడా రిజర్వ్ డే అందుబాటులో ఉంది. అంటే.. 15వ తేదీన మ్యాచ్ పూర్తిగా రద్దయితే 17న రిజర్వే డే, 16వ తేదీన జరిగే రెండో సెమీ ఫైనల్స్ వర్షం వల్ల లేదా అనివార్య కారణాల వల్ల రద్దయితే 18వ తేదీన రిజర్వ్ డే నాడు మళ్లీ ఆడే అవకాశం ఉంది. రెండు సెమీ ఫైనల్స్ టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. రెండో సెమీస్ దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించనున్నారు.