Begin typing your search above and press return to search.

ద్రవిడ్, రోహిత్ ల నిర్ణయం వల్లే వరల్డ్ కప్ ఓటమి: కైఫ్

అయితే, భారత జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న ఓ నిర్ణయం వల్లే కప్ చేజారిందని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంట్రేటర్ మహమ్మద్ కైఫ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   17 March 2024 9:24 AM GMT
ద్రవిడ్, రోహిత్ ల నిర్ణయం వల్లే వరల్డ్ కప్ ఓటమి: కైఫ్
X

గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆసీస్ చేతిలో కంగారు పడ్డ టీమిండియా 140 కోట్ల మంది భారతీయుల కలను నెరవేర్చలేకపోయింది. టాస్ ఓడిపోవడం, మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో ఇండియా బ్యాటింగ్ సమయంలో స్లో గా ఉంటూ బౌలింగ్ కు అనుకూలించిన పిచ్...సెకండ్ హాఫ్ లో ఆసీస్ బ్యాటింగ్ సమయంలో బ్యాటింగ్ కు అనుకూలించడం, ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన బ్యాటింగ్ వంటి కారణాలతోనే భారత జట్టు ఓటమి పాలైందని అంతా అనుకున్నారు. అయితే, భారత జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న ఓ నిర్ణయం వల్లే కప్ చేజారిందని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంట్రేటర్ మహమ్మద్ కైఫ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఫైనల్‌ మ్యాచ్ కు స్లో పిచ్ కావాలని కెప్టెన్ రోహిత్ శర్మి, కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు మేనేజ్‌మెంట్‌ అడిగిందని, ఫైనల్‌లో టీమిండియా ఓటమికి అదే కారణమని కైఫ్ ఆరోపించాడు. ఫైనల్ మ్యాచ్ సమయంలో హిందీ కామెంటరీ బాక్స్‌లో సభ్యుడిగా తాను ఉన్నానని, పిచ్ 3 రోజుల్లోనే రంగు మారడాన్ని తాను గమనించానని అన్నాడు. అదే భారత్‌ను దెబ్బకొట్టిందని చెబుతున్నాడు. మ్యాచ్ ముందు రోజు సాయంత్రం పిచ్‌ పరిశీలనకు రోహిత్, ద్రవిడ్ వచ్చారని, గంటపాటు పిచ్ వెనక నిలబడి పరిశీలించారని అన్నాడు.

ఆస్ట్రేలియాకు ఫాస్ట్ బౌలర్లు కమిన్స్, స్టార్క్ ఉన్నందున స్లో పిచ్‌లు ఇవ్వాలని వారు భావించారని చెప్పుకొచ్చాడు. ఇక్కడ వారు తడబడ్డారని, క్యురేటర్ పిచ్‌ను తయారుచేస్తాడని జనం నమ్ముతుంటారని చెప్పాడు. పిచ్ రూపొందించడంలో ఆతిథ్య దేశానికి అన్ని హక్కులు ఉంటాయని కైఫ్ అన్నాడు. స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్ కఠినంగా ఉంటుందని కమిన్స్ చెన్నై మ్యాచ్‌లో గ్రహించాడని, అందుకే ఫైనల్‌లో ఎవరూ తొలుత ఫీల్డింగ్ చేయడానికి ఇష్టపడకపోయినా...టాస్ గెలిచిన కమ్మిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడని చెప్పాడు. ఆ రకంగా హెడ్ హీరో కాదని...జట్టుకు విజయాన్ని అందించిన కమ్మిన్స్ హీరో అని అన్నాడు.