Begin typing your search above and press return to search.

ఎల్బీలను పసిగట్టలేని ట్రాకర్.. డీఆర్ఎస్ డిష్యుం డిష్యుం

ఈ రెండు కీలక మ్యాచ్ లలోనూ..భారత్ –పాకిస్థాన్, ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా ఈ జట్ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ లు అత్యంత కీలకం, ఆసక్తికరం.

By:  Tupaki Desk   |   16 Oct 2023 9:07 AM GMT
ఎల్బీలను పసిగట్టలేని ట్రాకర్.. డీఆర్ఎస్ డిష్యుం డిష్యుం
X

క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఔట్ లలో అత్యంత ఆసక్తికరమైనది లెగ్ బిఫోర్ ద వికెట్ (ఎల్బీడబ్ల్యూ). క్యాచ్, రనౌట్, బౌల్డ్, స్టంపింగ్ లలో లేని సంక్లిష్టత ఎల్బీడబ్ల్యూలో ఉంటుంది. బౌలర్ బంతి వికెట్ దిశగా సరైన దిశలోనే పడిందా? అలా పడిన బంతి వికెట్ల ను తాకుతుందా లేదా? అనేది ఎల్బీడబ్ల్యూ నిర్ణయానికి ఆధారం. అయితే, దీనిపై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎల్బీల విషయంలో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ లో కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇస్తూ 2008లో ప్రవేశపెట్టినదే డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్).

కచ్చితమే.. కానీ,ఓవిధంగా చెప్పాలంటే డీఆర్ఎస్ వచ్చాక క్రికెట్ లో ఎల్బీ నిర్ణయాలపై వివాదాలు తగ్గాయి. బౌలింగ్ జట్టు అప్పీల్ ను అంపైర్ తిరస్కరిస్తే థర్డ్ అంపైర్ ను రివ్యూ కోరే విధానం చాలా మెరుగ్గా ఉంది. రీ ప్లేలో.. బంతి పడిన విధానం, వికెట్లను తగులుతుందా? లేదా అని గమనించి మరీ ఔట్/నాటౌట్ నిర్ణయం వెలువరిస్తుండడంతో గొడవ లేకుండా పోయింది. అయితే ప్రస్తుత ప్రపంచ కప్ లో మాత్రం డీఆర్ఎస్ గురించి విమర్శలు వస్తున్నాయి.

డీఆర్ఎస్ ఒక్కటే.. మ్యాచ్ మ్యాచ్ కు మారుతుందా? ఈ కప్ లో డీఆర్‌ఎస్‌ ఫలితం మ్యాచ్ మ్యాచ్ కు మారుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఉదాహరణకు భారత్-పాకిస్థాన్ మధ్య గత శనివారం మ్యాచ్ లో మొహమ్మద్ రిజ్వాన్ విషయంలో వెలువడిన నిర్ణయాన్ని చూపుతున్నారు. ఈ మ్యాచ్ లో రిజ్వాన్ ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. జడేజా బౌలింగ్ లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చినా.. థర్డ్ అంపైర్ ఔటివ్వలేదు. బంతి లెగ్‌ స్టంప్‌ పక్కనుంచి వెళ్తుందని ట్రాకర్‌ చూపడంతో నాటౌట్‌ అని ప్రకటించాడు.

ఈ రెండు కీలక మ్యాచ్ లలోనూ..భారత్ –పాకిస్థాన్, ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా ఈ జట్ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ లు అత్యంత కీలకం, ఆసక్తికరం. సరిగ్గా ఈ జట్ల మ్యాచ్ లలోనే డీఆర్ఎస్ వివాదం తలెత్తడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్‌ థర్డ్ అంపైర్ నిర్ణయానికి ఎల్బీగా ఔటయ్యాడు. అప్పుడు బౌలర్ రబడ. ఇక భారత్ –పాక్ మ్యాచ్ లో రిజ్వాన్ బంతిని అడ్డంగా ఆడబోయి బంతిని ప్యాడ్లకు తగిలించుకున్నాడు. ఫీల్డ్ అంపైర్‌ ఔటిచ్చినా రిజ్వాన్‌ సమీక్ష కోరడంతో థర్డ్ అంపైర్‌ నాటౌట్ అని ప్రకటించాడు. ఇక రబాడ బంతికి స్మిత్‌ ఎల్బీ అవలేదని ఫీల్డ్ అంపైర్‌ ప్రకటించగా.. దక్షిణాఫ్రికా సమీక్ష కోరింది. బంతి పడ్డ కోణం చూస్తే అది స్టంప్‌ ను తాకదనే అనిపించింది. కానీ ట్రాకర్‌ మాత్రం లెగ్‌ స్టంప్‌ ను తాకుతున్నట్లు చూపింది. దీనిని నమ్మని స్మిత్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

రెండుసార్లూ అంతే..స్మిత్, రిజ్వాన్ ఔట్-నాటౌట్ సందర్భాల్లో బౌలర్ వేసిన బంతి యాంగిల్ ఒకేలా కనిపించింది. కానీ, ఫలితం మాత్రం మారింది. ఇక్కడ పొరపాటు థర్డ్ అంపైర్ ది అని చెప్పలేం.. ఎందుకంటే.. ట్రాకర్ భిన్నమైన ఫలితాలు చూపింది. దీంతో డీఆర్‌ఎస్‌ సాంకేతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొసమెరుపు: స్మిత్ ఆస్ట్రేలియా ప్రధాన బ్యాట్స్ మన్. రిజ్వాన్ పాక్ బ్యాటింగ్ ఆర్డర్ మూల స్తంభం. ఇద్దరు ప్రధాన బ్యాట్స్ మెన్ విషయంలో.. అదీ ప్రధాన జట్లతో మ్యాచ్ జరుగుతుండగా, డీఆర్ఎస్ ఫలితం విభిన్నంగా రావడం గమనార్హం. రిజ్వాన్ థర్డ్ అంపైర్ నిర్ణయంతో బతికిపోయినా.. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. స్మిత్ నాటౌట్ అయి ఉంటే పెద్ద ఇన్నింగ్స్ ఆడేవాడేమో..? అందుకనే.. మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల ఆటగాళ్ల విషయంలో డీఆర్ఎస్ ‘‘తుస్’’ అనడం విమర్శలకు తావిస్తోంది.