Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా.. తొలి భారతీయుడిగా రికార్డు!

140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ బరిలోకి దిగిన భారత సూపర్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేశాడు

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:54 AM GMT
చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా.. తొలి భారతీయుడిగా రికార్డు!
X

బళ్లెం వీరుడు, ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా సంచలనం సృష్టించాడు. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ లో స్వర్ణ పతకం పొందిన తొలి భారతీయుడిగా నిలిచాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ లో జరిగిన వరల్డ్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ లో జావెలిన్‌ త్రో విభాగంలో బరిలోకి దిగిన ఈ భారత స్టార్‌ అనుకున్నట్టే లక్ష్యాన్ని సాధించి పసిడి పతకాన్ని ఒడిసిపట్టాడు.

ఆగస్టు 27న జరిగిన ఈ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో నీరజ్‌ జావెలిన్‌ త్రోను 88.17 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయాడు. పాకిస్థాన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ (87.82 మీటర్లు) రజతం నెగ్గగా.. చెక్‌ రిపబ్లిక్‌ కు చెందిన వద్లెచ్‌ (86.67 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నాడు.

కాగా నీరజ్‌ చోప్రా గెలిచిన ఈ స్వర్ణం.. మొత్తంగా ప్రపంచ అథ్లెటిక్స్‌ లో భారత్‌ కు లభించిన మూడో పతకం మాత్రమే కావడం గమనార్హం. ఇందులో రెండు నీరజ్‌ చోప్రావే కావడం గమనార్హం. ఇంతకుముందు 18 ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్‌ జరగ్గా మన దేశానికి రెండే పతకాలు లభించాయి. మహిళల లాంగ్‌జంప్‌ లో భారత అథ్లెట్‌ అంజు బాబీ జార్జ్‌ 2005లో కాంస్యం సాధించగా.. 2022 ఛాంపియన్‌ షిప్‌ లో నీరజ్‌ రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ బరిలోకి దిగిన భారత సూపర్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేశాడు. ఇక రెండో ప్రయత్నంలో త్రోను 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. మూడోసారి 86.32 మీటర్లు విసిరాడు. ఇదే సమయంలో 87.82 త్రోతో పాక్‌ జావెలియన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో నాలుగో ప్రయత్నంలో నీరజ్‌ 84.64 మీటర్లు ఈటె విసిరాడు. ఆ తర్వాత వరుసగా 87.73 మీ, 83.98 విసిరాడు. దీంతో రెండో త్రోనే నీరజ్‌ చోప్రాకు అత్యుత్తమ ప్రదర్శన అయింది.

కాగా ఫైనల్‌ కు చేరుకున్న మరో ఇద్దరు భారత త్రోయర్లలో కిశోర్‌ జెనా (84.77 మీటర్లు) అయిదో స్థానంలో నిలవగా.. మను (84.14) ఆరో స్థానం దక్కించుకున్నాడు.

మరోవైపు ఈ విజయం కోసం ఎన్నో అవరోధాలను, గాయాలను దాటాడు.. నీరజ్‌ చోప్రా. రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌ లో స్వర్ణం, గతేడాది అథ్లెటిక్స్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాక నీరజ్‌ భుజానికి గాయమైంది.

ఆ టోర్నీ ఫైనల్లో నాలుగో త్రో టైమ్‌ లో కండరాల్లో చీలిక రావడంతో కొన్నాళ్లుపాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. గాయం తగ్గకపోవడంతో ఆ తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌ లోనూ పాల్గొనలేకపోయాడు.

భుజం గాయం నుంచి కోలుకొని డైమండ్‌ లీగ్‌ లో సత్తా చాటిన నీరజ్‌ చోప్రా.. ఈ ఏడాది ప్రారంభంలో మరోసారి గాయాలపాలయ్యాడు. నెలరోజుల పాటు ఇంటిలోనే ఉండిపోయాడు.

ఇక ఈ సీజన్‌లో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ తో పాటు ఏషియన్‌ గేమ్స్‌ కూడా ఉండటంతో తన ఫిట్‌నెస్‌ పై నీరజ్‌ చోప్రా ప్రత్యేక దృష్టి సారించాడు. విదేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందాడు. తద్వారా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ కు నీరజ్‌ చోప్రా సరైన ప్రణాళికతో సిద్ధమయ్యాడు.

ఈ ఏడాది మే నెలలో జరిగిన దోహా డైమండ్‌ లీగ్‌ లో 88.67 మీటర్లతో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. అదే నెలలో జావెలిన్‌ త్రో ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ గానూ అవతరించాడు. అయితే ఆ తర్వాత మరోసారి కండరాల గాయానికి గురైన నీరజ్‌ చోప్రా.. జూలై వరకు ఆటకు దూరంగా ఉన్నాడు. గాయాలను జయించి తాజాగా వరల్డ్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ లో పసిడి పతకాన్ని ఒడిసిపట్టాడు.