వన్డే వరల్డ్ కప్ విశేషం...రిఫరీలు, అంపైర్లు అందరూ మహిళలే!
మెన్స్ ఫస్ట్ వన్డే వరల్డ్ కప్ 1975లో మొదలైతే అంతకు రెండేళ్ల ముందే 1973లో మహిళల ప్రపంచ కప్ జరిగింది.
By: Tupaki Desk | 12 Sept 2025 9:34 AM ISTఅనుకున్నంత పేరు రాలేదు కానీ... పురుషులతో సమానంగా ఎదగలేకపోయింది కానీ.. మహిళల వన్డే ప్రపంచ కప్ ది కూడా పెద్ద చరిత్రే..! అసలు పురుషుల వరల్డ్ కప్ కంటే ముందే అమ్మాయిల ప్రపంచకప్ మొదలైంది అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక ఈ నెల 30 నుంచి మళ్లీ మహిళల వన్డే ప్రపంచ కప్ జరగనుంది. దీనికి భారత్ తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి.
పురుషుల కంటే ముందే... ఆస్ట్రేలియాదే పైచేయి
మెన్స్ ఫస్ట్ వన్డే వరల్డ్ కప్ 1975లో మొదలైతే అంతకు రెండేళ్ల ముందే 1973లో మహిళల ప్రపంచ కప్ జరిగింది. ఈ నెల ఆఖరు నుంచి జరిగేది 13వది. మొత్తం ఐదు దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. పురుషుల్లో మాదిరిగానే మహిళల క్రికెట్‌లోనూ ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. 12 వరల్డ్ కప్‌లలో భారత్, ఇంగ్లండ్ చెరో మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చాయి. ఇప్పుడు మన దేశం నాలుగోసారి వేదిక కానుంది. ఇక ఏడుసార్లు ఆస్ట్రేలియానే ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. ఇంగ్లండ్ నాలుగుసార్లు, న్యూజిలాండ్ ఒకసారి గెలిచాయి. భారత్ రెండుసార్లు, వెస్టిండీస్ ఒకసారి ఫైనల్ చేరినా కప్ కొట్టలేకపోయాయి.
టి20ల్లో ప్రయోగం.. వన్డేల్లో తొలిసారి
ఈ నెల 30 నుంచి జరిగే ప్రపంచ కప్ లో ఓ ప్రత్యేకత ఉంది. ఈసారి టోర్నీ హిస్టరీలోనే మొదటిసారి పూర్తిగా మహిళలతో ఈవెంట్ జరపనున్నారు. అంటే.. మహిళా అంపైర్లు, మహిళా రిఫరీలే ఉంటారన్నమాట. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే ఈ మేరకు నియామకాలు చేసింది. గతంలో టి20 ప్రపంచ కప్, కామన్వెల్త్ గేమ్స్ లో అందరూ మహిళలే ఉన్నా.. వన్డే ప్రపంచ కప్ లో మాత్రం ఇప్పుడే ఆ ప్రయోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్యానెల్ ను చూస్తే 14 మంది మహిళా, నలుగురు మహిళా మ్యాచ్ రిఫరీలు సేవలందించనున్నారు.
రిఫరీల్లో భారతీయురాలు..
అంపైరింగ్ క్రికెట్ లో చాలా బాధ్యతాయుతమైనదే కాదు... క్లిష్టమైనది కూడా. పైగా వన్డేల్లో అంటే ఇంకా ముఖ్యమైనది. తాజాగా ప్రపంచ కప్ బాధ్యతల్లో నియమితులైన అంపైర్లలో క్రికెట్ అభిమానులకు తెలిసినవారే అధికం. క్లైర్ పోల్సాక్, జాక్వెలిన్ విలియమ్స్, స్యూ రెడ్ ఫెర్న్ అయితే మూడో వన్డే ప్రపంచ కప్ ఆడుతున్నారు. ఆగెన్ బాగ్, కిమ్ కాటన్ లు రెండో ప్రపంచ కప్ లో పాల్గొంటున్నారు. రిఫరీల్లో ఎక్స్‌పీరియన్స్ తో పాటు కొత్తవారికీ చాన్స్ ఇచ్చారు. ట్రూడీ అండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్ తో పాటు మిచెల్ పెరీరా, భారతీయురాలైన జీఎస్ లక్ష్మి ఇందులో ఉన్నారు.
ఇది చరిత్రాత్మకం... జై షా
అంపైర్లు, రిఫరీలు మహిళలే ఉంటూ ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీని నిర్వహించనుండడం చరిత్రాత్మకమైన అడుగు అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా కొనియాడారు. మహిళా క్రికెట్ లో ఇదో అద్భుతం అని పేర్కొన్నారు. కొత్త ఒరవడికి మార్గం వేస్తుందని.. స్త్రీ, పురుష సమానత్వం పెంపునకు దోహదం చేస్తుందని వివరించారు.
