Begin typing your search above and press return to search.

వచ్చే ప్రపంచ కప్ నకు వన్డేలు ఇలాగే ఉంటాయా?

2003లో ఇక్కడ జరిగిన ప్రపంచ కప్ విజయవంతమైనా.. కొన్ని విమర్శలు వచ్చాయి. ఇక ఈసారి మన దేశమే ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఆ మాటే రాలేదు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 11:16 AM GMT
వచ్చే ప్రపంచ కప్ నకు వన్డేలు ఇలాగే ఉంటాయా?
X

ప్రపంచ కప్ 13వ ఎడిషన్ ముగిసింది. భారత్ ఒంటిచేత్తో నిర్వహించి భళా అనిపించుకుంది. మొత్తం 45 రోజులు.. 48 మ్యాచ్ లను పది మైదానాల్లో ఏర్పాటు చేసింది. పది జట్లకు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకుంది. ఇక్కడివరకు బాగానే ఉంది. మరో నాలుగేళ్లకు గాని ప్రపంచ కప్ జరిగే వీలు లేదు. అందులోనూ వచ్చేసారి ఆతిథ్యం ఇవ్వనున్నది దక్షిణాఫ్రికా, జింబాబ్వే. 2003లో ఇక్కడ జరిగిన ప్రపంచ కప్ విజయవంతమైనా.. కొన్ని విమర్శలు వచ్చాయి. ఇక ఈసారి మన దేశమే ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఆ మాటే రాలేదు. ఏకంగా 12.50 లక్షల మంది స్టేడియానికి వచ్చి వీక్షించారు.

వచ్చేసారికి ఏంటి పరిస్థితి?

క్రికెట్ లో భారత్ అంటే భారతే. కొన్ని మ్యాచ్ లు మినహా మొన్నటి ప్రపంచ కప్ సందర్భంగా స్టేడియాలు నిండిపోయాయి. ఇతర దేశాల్లో అయితే ఈ పరిస్థితి ఉండదు. అందులోనూ వన్డేలకు వచ్చేసరికి ఆదరణ బాగా తగ్గుతోంది. ఇతర దేశాల్లో ప్రపంచ కప్ వరకు ఓకే.. మరి ద్వైపాక్షిక సిరీస్ లకు..? అందులోనూ వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్‌ లు, మ్యాచ్‌ ల సంఖ్య తగ్గుతోంది. ఇదివరకు ఒక్కో జట్టు 50 మ్యాచ్ లకు తగ్గకుండా ఆడేవి. ఇప్పటి పరిస్థితి చూస్తే.. 2024-27 ప్రపంచ కప్‌ నడుమ ద్వైపాక్షిక సిరీస్‌ ల్లో భాగంగా భారత్‌ 30 వన్డేలు మాత్రమే ఆడనుంది. మనమే ఇలా ఉంటే మిగతా జట్లు ఇంతకన్నా తక్కువ మ్యాచ్ లే ఆడనున్నాయి. దీనికి ఓ ఉదాహరణ ఏమంటే.. 2019 ప్రపంచకప్‌ ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డ ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌.. మళ్లీ వన్డేలో ఎదురుపడింది మొన్నటి ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ ద్వారానే. అంటే నాలుగేళ్ల తర్వాత కానీ.. ఈ జట్లు ముఖాముఖి ఆడలేదు. టెస్టులకు ప్రాధాన్యం ఇచ్చే దేశాలు కావడంతోనే పరిస్థితి వచ్చింది.

పొట్టి క్రికెట్ దే మజా..

వన్డే ప్రపంచ కప్ నాలుగేళ్లకోసారి జరుగుతుంది. టి20 ప్రపంచ కప్ లు మాత్రం రెండేళ్లకోసారి నిర్వహిస్తుంటారు. 2024, 2026లో టి20 ప్రపంచ కప్‌ ఉంది. దీంతో జట్లన్నీ దీనిమీదే దృష్టి పెడతాయి. 2027లో వన్డే ప్రపంచకప్‌ ఉంది. ఇది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే ల్లో జరగనుంది. దీంతో ఆదరణ దక్కుతుందా లేదా? అనేది అనుమానంగా ఉంది.

సమయం.. సందర్భం..

ఇప్పుడంతా స్పీడ్ యుగం. టి20లు మూడున్నర గంటల్లో ముగుస్తాయి. వన్డేలయితే ఏడెనిమిది గంటలు తక్కువ పట్టదు. అందులోనూ నాలుగేళ్ల తర్వాత కాలం మరింత మారుతుంది. అప్పటికీ వన్డేలకు ఆదరణ ఉంటుందా? అంటే కష్టమే. 2015 ప్రపంచ కప్ 2019 ప్రపంచ కప్ నాటికి ప్రేక్షకుల సంఖ్య తగ్గడమే కారణం. మొన్నటి కప్ భారత్ లో జరిగింది కాబట్టి ఆదరణ ఉంది. దీనిని పరిగణించక్కర్లేదు.

ఫార్మాట్ మారుతుందా?

వన్డేల మనుగడకు ఫార్మాట్‌ మార్చాలని దిగ్గజాలు ఎప్పటినుంచో చెబుతున్నారు. 25 ఓవర్ల చొప్పున నాలుగు ఇన్నింగ్స్ లుగా విభజించాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ చెబుతున్నాడు. తొలి 25 ఓవర్ల పాటు ‘ఎ’ జట్టు బ్యాటింగ్‌ చేస్తే, తర్వాతి 25 ఓవర్లు ‘బి’ బ్యాటింగ్‌. ‘ఎ’ జట్టు స్కోరు ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచి 25 ఓవర్లు ఆడాలని, మళ్లీ ‘బి’ జట్టు ఛేదన చేయాలని సచిన్‌ పేర్కొన్నాడు. ఒక విధంగా ఇది సెమీ టెస్టు ఫార్మాట్. పాకిస్థాన్ దిగ్గజం అక్రమ్ మరో అడుగు ముందుకేసి 40 ఓవర్లకు వన్డేలను కుదించాలంటున్నాడు. కాగా.. ఇప్పుడు వన్డేల్లో తొలి, చివరి 10 ఓవర్లు మాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి. మధ్యలోని 30 ఓవర్లు బోరింగ్. ఈ నేపథ్యంలో ఫార్మాట్ ను మార్చేందుకు ఐసీసీ చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. ఇక వరల్డ్ కప్ నకు ఏడాది ముందు నుంచే వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ లు నిర్వహించాలని మెరిల్ బోర్న్ క్రికెట్ కమిటీ సూచిస్తోంది.