300 కొట్టే జట్టులో..పరుగులివ్వకుండా బంతులు..ఐపీఎల్ లో మహా పిసినారి
టి20 క్రికెట్ అంటేనే ధనాధన్.. బ్యాట్స్ మెన్ రాజ్యం.. పాపం బౌలర్లు అని బాధపడే పరిస్థితి.. కొందరిపైన అయితే జాలి చూపాల్సి వస్తుంది
By: Tupaki Desk | 28 March 2025 10:00 PM ISTటి20 క్రికెట్ అంటేనే ధనాధన్.. బ్యాట్స్ మెన్ రాజ్యం.. పాపం బౌలర్లు అని బాధపడే పరిస్థితి.. కొందరిపైన అయితే జాలి చూపాల్సి వస్తుంది.. ఇక బ్యాటింగ్ స్వర్గధామం లాంటి ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపీఎల్) లో అయితే...? భారత పిచ్ లపై బ్యాట్స్ మెన్ చెలరేగలేదంటే.. బౌలర్ బలి కాలేదంటే బాధపడాలి.. కానీ, మన ఐపీఎల్ లోనూ ఓ బౌలర్ ఉన్నాడు.. అతడు మహా పిసినారి. ఇంతకూ ఎవరంటే..?
300 కొట్టే జట్టులో..
2024లో సరిగ్గా ఇదే రోజుల్లో ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే పెద్ద సంచలనం.. ఒకప్పుడు 140-150 పరుగులు చేసి దానిని కాపాడుకునే జట్టుగా పేరున్న సన్ రైజర్స్.. నిరుడు మాత్రం దీనికి రెట్టింపు స్కోర్లు నమోదు చేసింది. ఆస్ట్రేలియన్ ట్రావిస్ హెడ్, యువ సంచలనం అభిషేక్ శర్మ, తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వీర బాదుడుతో 250 పరుగులను అలవోకగా బాది పడేసింది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ లోనూ 286 పరుగుల రెండో అత్యధిక స్కోరు చేసింది. కాగా, గత సీజన్ వరకు లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు టీమ్ ఇండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.
మంచి స్వింగ్ బౌలర్ అయిన భువీ.. కొన్నాళ్లుగా తన స్వింగ్ తగ్గడంతో టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. ఈ ఏడాది సన్ రైజర్స్ కూ దూరమయ్యాడు. అయితే, భువీ ఖాతాలో మాత్రం ఓ అద్భుత రికార్డు ఉంది.
బ్యాట్స్ మెన్ ఇష్టారాజ్యంగా బాదేసే టి20ల్లో డాట్ బాల్స్ (పరుగులివ్వని బంతులు) అంటే చాలా కష్టం. కానీ, భువీ
176 మ్యాచుల్లో 1,670 డాట్స్ వేశాడు. మొత్తం 704 ఓవర్లలో 278 ఓవర్ల పాటు పరుగులు ఇవ్వలేదని దీనిద్వారా తెలుస్తోంది. 14 ఓవర్లు మెయిడెన్ గా వేసిన అతడు లీగ్ లో 181 వికెట్లు తీశాడు. ఈ రికార్డును బీట్ చేయడం చాలా కష్టం అనే చెప్పాలి. కాకపోతే.. కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ (1,610 బంతులు), ఈ ఏడాది చెన్నై తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ (1,572 బంతులు) కాస్త చేరువగా ఉన్నారు. కానీ, భువీ ఈ సారి బెంగళూరుకు ఆడుతున్నాడు. తన రికార్డును అతడు మరింత మెరుగు పరుచుకుంటే.. మాత్రం ఎవరూ చేరుకోలేరు.
