Begin typing your search above and press return to search.

బిరియానీ వేడిలో సానియా మిర్జాపై పంచ్ వేసాడు!

ప్ర‌పంచ దేశాల్లో హైద‌రాబాదీ బిర్యానీ గురించి, సానియా మిర్జా గురించి చ‌ర్చ చాలా కామ‌న్‌. హైద‌రాబాదీ బిర్యానీ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్.

By:  Tupaki Desk   |   8 Oct 2023 8:33 PM IST
బిరియానీ వేడిలో సానియా మిర్జాపై పంచ్ వేసాడు!
X

ప్ర‌పంచ దేశాల్లో హైద‌రాబాదీ బిర్యానీ గురించి, సానియా మిర్జా గురించి చ‌ర్చ చాలా కామ‌న్‌. హైద‌రాబాదీ బిర్యానీ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్. అలాగే టెన్నిస్ స్టార్ సానియాకు అంతే క్రేజ్ ఉంది. అందుకే ఇప్పుడు సీనియ‌ర్ క్రికెట‌ర్ కం కోచ్ వ‌శీం అక్ర‌మ్ కామెంట్ల‌కు అంత‌టి ప్రాధాన్య‌త నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో పాకిస్తాన్ లోని క‌రాచీ బిర్యానీతో భార‌త‌దేశంలోని హైద‌రాబాద్ బిర్యానీ పోలిక‌పై క్రికెట‌ర్ల‌లో వాడి వేడి డిబేట్ ర‌న్ అవుతోంది. ప్ర‌పంచ‌క‌ప్ స‌న్నాహ‌క మ్యాచ్ ల వేళ ఇది ఊసుపోని స‌ర‌దా వ్యాప‌కంగా మారింది. సోష‌ల్ మీడియాల్లో నేటి యూత్ లో ఇది గ‌మ్మ‌త్త‌యిన చ‌ర్చ‌గా మారింది.

కరాచీ బిర్యానీ వర్సెస్ హైదరాబాదీ బిర్యానీపై జరిగిన సరదా చర్చలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆమె పేరు చెప్పకుండానే లైట‌ర్ వెయిన్ గా పంచ్ వేసాడు. ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌ను చూపిస్తూ, హైదరాబాదీ బిర్యానీ గురించి తనకు మరింత బాగా తెలుసునని అక్రమ్ స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. మాలిక్‌కు హైదరాబాద్‌కు చెందిన మీర్జాతో వివాహమైంది. ఇద్దరు క్రీడా రంగంలో రాణించిన మేటి సెల‌బ్రిటీలు అన్న సంగ‌తి తెలిసిందే. ఈ జోడీ ఏప్రిల్ 2010లో వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 2018లో తల్లిదండ్రులు అయ్యారు. అందువ‌ల్ల మాలిక్ కి హైద‌రాబాదీ బిర్యానీతో గొప్ప అనుబంధం ఉంద‌న‌డంలో సందేహం లేదు.

క్రికెట‌ర్ల‌కు రెగ్యుల‌ర్ గా హైద‌రాబాద్ బిర్యానీతో అనుబంధం ఎక్కువ‌. ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్ ఆడితే హైద‌రాబాద్ ద‌మ్ బిరియానీ టేస్ట్ చేయ‌నిదే వ‌ద‌ల‌రు. అందుకే క్రికెట్‌తో పాటు, ప్రస్తుత ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ టీమ్ గురించి, బిర్యానీ గురించి స‌ర‌దా పరిహాసాలు నెటిజ‌నుల్లో చూస్తున్నాం. కరాచీ వర్సెస్ హైదరాబాదీ బిర్యానీ డిబేట్‌పై తన అభిప్రాయాలను తెలిపే క్లిప్‌ను స్వయంగా పాక్ మాజీ కెప్టెన్ వ‌శీం అక్రమ్ తన X ఖాతాలో షేర్ చేయ‌డంతో అవి వైర‌ల్ గా మారాయి. ఆయ‌న‌ ఇలా వ్యాఖ్యానించాడు. ``నేను హైదరాబాదీ బిర్యానీ ట్రై చేశాను. సహజంగానే, ఇస్కో (మాలిక్‌ని సూచిస్తూ) జ్యాడా హోగా (అతనికి మరింత అనుభవం ఉంటుంది). నా భారతీయ మిత్రులారా.. దయచేసి కలత చెందకండి. నేను నిజం మాట్లాడుతున్నాను. కరాచీలో లభించే బిర్యానీకి పోటీ లేదు. నేను హైదరాబాదీ బిర్యానీ ట్రై చేశాను. ఇది పులావ్ లాగా, రంగు బియ్యం, చికెన్ లేదా మటన్ క‌ల‌యిక‌తో ఏదోలా పొడిగా ఉంటుంది`` అని కామెంట్ చేసాడు.

దీనికి మాలిక్ బదులిస్తూ, హైదరాబాదీ బిర్యానీలో మసాలా కింద వైపుగా ద‌ట్టించి దాని పైన అన్నం పెడతారు.. అని అన్నాడు. మొత్తానికి ఈ డిబేట్ ఆట‌గాళ్ల న‌డుమ‌ ఆస‌క్తిక‌రంగా సాగింది. అక్ర‌మ్ కంటే ముందు ప్రస్తుత ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా హైదరాబాద్ బిర్యానీ vs కరాచీ బిర్యానీ చర్చలో పాల్గొన్నారు. తమ ఆలోచనలను షేర్ చేసారు. టీమ్ స్కిప్పర్ బాబర్ ఆజం ఏమ‌న్నారంటే.. రెండు బిర్యానీలు సమానంగా రుచికరమైనవి అయితే, హైదరాబాదీ బిరియానీ కొంచెం స్పైసీగా ఉంటుంది. మరోవైపు పేసర్ హసన్ అలీ, కరాచీలో లభించే దానికంటే హైదరాబాదీ బిర్యానీ గొప్పదని పేర్కొన్నాడు. ఇమామ్-ఉల్-హక్ .. హరీస్ రవూఫ్ కూడా హైదరాబాదీ బిర్యానీ అద్భుతం అంటూ కితాబిచ్చేసారు. అది త‌మ‌కు బాగా న‌చ్చుతుంద‌ని అన్నారు. ఐసీసీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో బిరియానీపై ఆసక్తికరమైన చర్చకు సంబంధించిన వీడియోను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

వార్మప్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన తర్వాత, లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ కూడా హైదరాబాదీ బిర్యానీపై ఇలా వ్యాఖ్యానించాడు. ``మేము రోజూ తింటున్నాము. బహుశా అందుకే మేము కొంచెం నెమ్మదిగా ఉన్నాము (నవ్వుతూ)`` అని కామెంట్ చేసాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. టాస్ ఓడిపోయిన డచ్ జట్టు ముందుగా పాక్ ని బ్యాటింగ్ చేయమని కోరింది.