Begin typing your search above and press return to search.

ముంబై వర్సెస్ ఢిల్లీ... ఛేజింగ్ గ్రౌండ్ లో విజయం ఎవరికి దక్కేనో?

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి

By:  Tupaki Desk   |   7 April 2024 4:07 AM GMT
ముంబై వర్సెస్ ఢిల్లీ... ఛేజింగ్ గ్రౌండ్ లో విజయం ఎవరికి దక్కేనో?
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ముంబై ఈ సీజన్ లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌ లు ఆడగా అన్నింటిలోనూ ఓడిపోయింది. మరోవైపు మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ తొలి విజయం సాధించింది.

మొత్తం మీద ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒకటి గెలిచి మూడు మ్యాచ్ లలో ఓడిపోయి ఢిల్లీ ఉంటే... ఆడిన మూడు మ్యాచ్ లలోనూ వరుసగా ఓడిపోయిన పరిస్థితిలో ముంబై ఉంది. దీంతో.. పాయింట్ల పట్టికలో ముంబై 10, ఢిల్లీ 9 ప్లేస్ కు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో... ఆన్ పేపర్ ఎంతో బలంగా ఉన్న ఈ రెండు టీం లూ ఈసారి మైదానంలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ టీం విషయానికొస్తే... ఆడిన మూడు మ్యాచ్ లలోనూ తిలక్ వర్మ చేసిన 121 పరుగులు చేయగా.. టిం డేవిడ్ 70.. రోహిత్ శర్మ 69 పౌగులు సాధించారు. ముంబై ఇండియన్స్ టాప్ & మిడిల్ ఆర్డర్ రాణిస్తే లెక్క వెరుగా ఉంటుంది! ఇక బౌలర్లలో మద్వాల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి 3 వికెట్లు తీసుకోగా.. బూమ్రా 3 మ్యాచ్ లు ఆడి మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

ఇక ఢిల్లీ టీం లో కెప్టెన్ రిషబ్ బంత్ 4 మ్యాచ్ లు ఆడి 152 పరుగులు చేయగా.. డేవిడ్ వార్నర్ 4 మ్యాచ్ లు ఆడి 148 పరుగులు చేశాడు. బౌలర్ల విషయానికొస్తే... ఖలీల్ అహ్మద్ 4 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు తీసుకోగా.. ముఖేష్ కుమార్ 2 మ్యాచ్ లు ఆడి 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో రెండు టీంలలోనూ ఏ ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్లు ఆడలేదనేది విమర్శ!

హెడ్ టు హెడ్ గణాంకాలు!:

ఇప్పటివరకూ ముంబై - ఢిల్లీ జట్లు 33 ఐపీఎల్ మ్యాచ్ లలో తలపడగా... వాటిలో ముంబై ఇండియన్స్ 18, ఢిలీ క్యాపిటల్స్ 15 మ్యాచ్ లలోనూ గెలిచాయి. ఇక ఢిల్లీపై ముంబై అత్యధిక స్కోరు 218 కాగా.. ముంబై పై ఢిల్లీ అత్యధిక స్కోరు 213.

పిచ్ రిపోర్ట్!:

ముంబైలోని వాంఖడే స్టేడియం విషయానికొస్తే... ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 172 కాగా.. రెండవ ఇన్నింగ్స్ లో 161 పరుగులు. అయితే... ఇక్కడ జరిగిన 12 టీ20లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 7 సార్లు గెలిచాయి! అందుకే దీన్ని మంచి ఛేజింగ్ గ్రౌండ్ గా భావిస్తారు. అందుకే ఇక్కడ టాస్ కీలకం కాబోతుందని అంటున్నారు. టాస్ గెలిచిన టీం తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు!